ఎమోషన్స్ ని ఫుల్ గా ప్యాక్ చేసి బీజేపీ...ఈసారి వర్కౌట్ అవుతుందా...?
బీజేపీ ఫిలాసఫీ హిందూత్వ, జాతీయ వాదం, దేవుళ్ళు, పుణ్య నదులు, సూర్య చంద్రులు, ఆధ్యాత్మికత ఇవన్నీ సమ్మిళితమైనది. భారతదేశంలో సెంటిమెంట్స్ ఎక్కువ.
By: Tupaki Desk | 7 Sep 2023 3:22 AM GMTబీజేపీ ఫిలాసఫీ హిందూత్వ, జాతీయ వాదం, దేవుళ్ళు, పుణ్య నదులు, సూర్య చంద్రులు, ఆధ్యాత్మికత ఇవన్నీ సమ్మిళితమైనది. భారతదేశంలో సెంటిమెంట్స్ ఎక్కువ. బీజేపీ హిందూత్వ విధానాలకు మెజారిటీ ప్రజలు ఆమోదం తెలిపేందుకు దశాబ్దాల కాలం పట్టింది కానీ ఇపుడు బీజేపీ విధానాలకు అలవాటు అయిన వారు ఉన్నారు. కాదని అన్న వారూ ఉన్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పరిణామాలు మారుతున్నాయి. మత ప్రాతిపదికన ఈ రోజుకీ పాలన సాగుతున్న దేశాలు ఉన్నాయి. ఎంతలా అంతరిక్షంలోకి దూసుకెళ్ళినా మతం, కులం ప్రాంతం దగ్గర అంతా ఒదిగిపోతూ అలా కిందకు దిగిపోతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో భారతదేశం ప్రజానీకంలో కూడా కొంత మార్పు వస్తున్న మాట వాస్తవం.
పొరుగున ఉన్న పాకిస్థాన్ ని చూసున్న భారతీయులకు ఆఫ్హనిస్తాన్ ఇపుడు కనిపిస్తోంది. దీంతో భారతదేశంలో మెజారిటీ వాదానికి నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. ఈ విధంగా ట్యూనప్ చేయడంతో గత వాజ్ పేయ్ అద్వానీ ద్వయం కంటే మోదీ అమిత్ షా ద్వయం పూర్తిగా విజయం సాధించారు.
ఈ క్రమంలో 2014 ఎన్నికలలో అభివృద్ధి నూతన భారతం నినాదంతో వస్తే 2019 నాటికి దేశానికి రక్షణ ఒక్క బీజేపీతోనే అని పాక్ తో దాడుల నేపధ్యంలో బీజేపీ చాటి చెప్పి మెజారిటీ ప్రజలను ఒప్పించింది. ఇక 2019 తరువాత కాశ్మీర్ ని భారత్ లో అంతర్భాగం చేస్తూ తీసుకున్న కఠిన నిర్ణయం తో భారతీయల మన్ననలు అందుకుంది.
అలాగే రామమందిరం అన్నది కలగా మారిన వేళ న్యాయస్థానాల ద్వారానే పరిష్కారం కనుగొని భవ్యమైన రామ మందిరం నిర్మాణానికి కూడా పూనుకుంది. మరో వైపు చూస్తే బీజేపీ ఎమోషనల్ ఇష్యూస్ తో భారతీయుల మనసు గెలుచుకోవడం ఎలాగో బాగా తెలుసుకుంది అంటున్నారు.
చంద్రయాన్ 3 విజయం అన్నది శాస్త్రవేత్తల ఘనత. అయితే దాని వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఉంది కాబట్టి తన ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ వెనకాడడంలేదు. అందుకే విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో కేంద్రానికి వచ్చి మరీ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూడా పిలవలేదు అని ఆ పార్టీ ఆక్షేపించినా పట్టించుకోలేదు.
ఇపుడు మరో అస్త్రంగా భారత్ నినాదం అందుకుంటోంది బీజేపీ. ఇండియా పేరుని భారత్ గా మార్చడం అంటే దేశంలో మెజారిటీ ప్రజలు కచ్చితంగా హర్షిస్తారు.ఎందుకంటే మన దేశం పేరు భారతే కాబట్టి. అయితే విపక్షాలు మాత్రం ఇది రాజకీయ కోణంలో తీసుకున్నది అంటున్నారు. వారు విమర్శిస్తున్నారు. అదే బీజేపీకి కావాల్సింది అంటున్నారు.
తాము దేశభక్తితో నిర్ణయం తీసుకుంటే విపక్షాలు ఆడిపోసుకున్నాయని చెప్పవచ్చు. అదే టైం లో గుత్తమొత్తంగా భారత్ పేరు వెనక ఉన్న ఎమోషన్స్ అన్నీ తమ సొంతం చేసుకోవచ్చు అన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. వీటికి తోడు రామమందిరం ప్రారంభం తో నిండుగా ఆ అస్త్రాన్ని కూడా వాడుకోవాలని చూస్తోంది.
గతంలో పాకిస్థాన్ తో యుద్ధం, ఇపుడు ఆ ప్లేస్ లో చైనా ఉంది. ఎపుడైనా చిన్నపాటి వార్ అయినా సరిహద్దులలో ఎన్నికల సమయంలోగా వచ్చినా రావచ్చు అంటున్నారు. అలా బీజేపీ ఎమోషన్స్ ని ఫుల్ గా ప్యాక్ చేసి రెడీ చేసి పెట్టుకుంది. 2024 ఎన్నికల కోసం ఇదంతా అని విపక్షాలు విమర్శలు చేయవచ్చు కాక. కానీ బీజేపీ మాస్టర్ ప్లాన్స్ వేరు. మరి 2014, 2019లలో మాదిరిగా ఈసారి వర్కౌట్ అవుతుందా అంటే జనాల తీర్పు కోసం వేచి చూడాల్సిందే అంటున్నారు.