Begin typing your search above and press return to search.

పవన్ కి అక్కడ షాక్ ఇచ్చేసిన బీజేపీ...!

ఇక పవన్ సినీ గ్లామర్ ఆయన సామాజిక నేపధ్యం వంటివి కలసివస్తాయని బీజేపీ పెద్దాశలే పెట్టుకుంది కానీ అవన్నీ వికటించాయి.

By:  Tupaki Desk   |   15 Dec 2023 2:47 PM GMT
పవన్ కి అక్కడ షాక్ ఇచ్చేసిన బీజేపీ...!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బీజేపీ షాక్ ఇచ్చేసిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అనిపిస్తోంది. నిన్న కాక మొన్న తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ జనసేన కలసి పోటీ చేసాయి. జనసేనకు ఎనిమిది సీట్లు ఇస్తే ఏడింట డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇక పవన్ సినీ గ్లామర్ ఆయన సామాజిక నేపధ్యం వంటివి కలసివస్తాయని బీజేపీ పెద్దాశలే పెట్టుకుంది కానీ అవన్నీ వికటించాయి.

బీజేపీకి ఎక్కడ బలం ఉందో అక్కడ మాత్రమే గెలిచింది. మిగిలిన చోట్ల ఓడింది. ఏది ఏమైనా బీజేపీ సొంత బలమే ఆ పార్టీకి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు తెప్పించాయని కమలనాధులు భావిస్తున్నట్లుగా ఉంది. ఈ నేపధ్యంలో రానున్న రోజు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని డిసైడ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోలింగ్ దగ్గర చేసి ప్రచారం చేశారు. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే.

దాంతో పవన్ ప్రచారం మీద బీజేపీకి ఎలాంటి ఆశలు లేకుండా పోయాయని అంటున్నారు. దాంతో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఏ పార్టీతో పొత్తులు ఉండవని తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి క్లారిటీగా చెప్పేశారు. జనసేనతో పొత్తు వేళ ఎన్డీయే పార్టనర్ అంటూ కమలనాధులు చాలా చెప్పారు. కానీ ఇపుడు మాత్రం గాజు గ్లాస్ వద్దు బాసూ అంటున్నారులా ఉంది.

ఇక జనసేనకు తెలంగాణాలో ఎంత బలం ఉందో బీజేపీకి తెలిసి వచ్చిన మీదటనే ఈ డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తే చేదు అనుభవం ఎదురైంది. అలా బీజేపీ జనసేన బంధం తెలంగాణా ఎంపీ ఎన్నికల్లో కనిపించబోదు అని అంటున్నారు.

అందుకే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ క్యాడర్ మొత్తం ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. ఇక డిసెంబర్ చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణాకు వస్తారని ఆయన తెలిపారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు కూడా ఒక విష ప్రచారం తప్ప అందులో వాస్తవం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక తెలంగాణాలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణాలో అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలిచి తీరుతుందని ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఆ దిశగా బీజేపీ కార్యాచరణ ఉంటుంది అని ఆయన అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి తీరుతుందని, కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు అని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇక తెలంగాణా బీజేపీకి సంబంధించి అన్ని కమిటీలను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈసారి సర్వేలకు సైతం అందని ఫలితాలు వస్తాయని బీజేపీ గెలిచి తీరుతుందని ఆయన జోస్యం చెప్పారు.