పవన్ కి బీజేపీ ఇచ్చిన సలహా ఇదే...!?
అదేంటి అంటే పవన్ ని ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయమని కోరుతున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 8 March 2024 9:23 AM GMTప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీతో పొత్తుల విషయం తేల్చుకునేందుకు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ పెద్ద, కేంద్ర మంత్రి అమిత్ షా తో ఇద్దరు నేతలూ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దలు పవన్ కి కొన్ని సూచనలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే పవన్ ని ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయమని కోరుతున్నారు అని అంటున్నారు.
ఏపీలో జనసేన తీసుకున్న సీట్లు కూడా బాగా తక్కువ. అవి 24 మాత్రమే. దాంతో ఆ సీట్లతో ఆయన ఏపీ రాజకీయాల్లో సాధించేంది పెద్దగా ఉండదన్న భావన కూడా ఉంది. దీంతో బీజేపీ పెద్దలు పవన్ కి ఎంపీగా పోటీ చేయమని కోరుతున్నారు అని అంటున్నారు. పవన్ ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కేంద్రంలో మూడవసారి కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, దాంతో పవన్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చేరవచ్చు అన్నదే బీజేపీ నేతలు పవన్ కి ఇస్తున్న సలహా అని అంటున్నారు.
ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా జనసేన నుంచి మరికొందరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఉంటుందని చెబుతున్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో ఎటూ చేరతారు. అలా అక్కడ చంద్రబాబు సీఎం అయినా ఆయనకు ధీటుగా కేంద్ర మంత్రిగా పవన్ కూడా అధికారికంగా బలంగా ఉంటారు ఇది జనసేన క్యాడర్ కి కూడా బూస్ట్ ఇచ్చేదిగా ఉంటుందన్నది బీజేపీ పెద్దల సలహా అని అంటున్నారు.
ఎమ్మెల్యేగా కనుక పవన్ పోటీ చేస్తే ఆయన బాబు క్యాబినెట్ లో మంత్రిగా మాత్రమే చేరాల్సి ఉంటుంది. అది జనసైనికులకు కూడా పూర్తి సంతృప్తి ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. పవన్ ని సీఎం గా ఊహించుకున్న వారికి ఇది కొంత ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందని అంటున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఇది విధానంగా ఉంటుందని, పవన్ ఫ్యూచర్ సీఎం గా కూడా ప్రోజెక్ట్ కావడానికి బాటలు వేస్తుందని అంటున్నారు.
అయితే బీజేపీ వరకూ ఈ పవర్ షేరింగ్ బాగానే ఉన్నా పవన్ ఆలోచిస్తున్నది ఓట్ల బదిలీ గురించి అని అంటున్నారు. ఇప్పటికే తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం వల్ల క్యాడర్ లో నిస్తేజం ఆవహించింది. గౌరవప్రదమైన సీట్లు అని చెప్పి పాతికకు కూడా ఒకటి తక్కువ తీసుకున్నారు అని అంటున్నారు. దీని మీద కాపు నేతలు అయితే కినుక వహించారు.
ఏది ఏమైనా తన రాజకీయ వ్యూహంలో ఇదంతా భాగం అని పవన్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇపుడు బీజేపీ సీన్ లోకి ఎంటర్ అయి పవన్ ని చంద్రబాబుని సరిసమానంగా ప్రొజెక్ట్ చేయలని అనుకుంటోంది. అందుకే బాబు పక్కన మంత్రిగా ఉండే బదులు మోడీ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రిగా ఉంటే ప్రోటోకాల్ పరంగా అలాగే స్టాటస్ పరంగా కూడా ఏపీ సీఎం పోస్టు కేంద్ర మంత్రి పదవి సరిసమానంగా ఉంటాయని వారు అంటున్నారు.
కానీ పవన్ ఎమ్మెల్యేగా పోటీలో లేకపోతే అపుడు జనసేనలో పూర్తి నైరాశ్యం వస్తుందని ఆలోచిస్తున్నారుట. అంతే కాదు రెండు చోట్ల పోటీ చేస్తే గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా రెండు చోట్ల ఫోకస్ పెట్టకుండా పోతారని అపుడు జనసేనతో సహా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా ఆలోచిస్తున్నారుట.
మరో వైపు చూస్తే పవన్ ఈ విషయం సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. జనసేన మూడు ఎంపీ సీట్లలో పోటీ చేయబోతోంది. అందులో కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి ఉన్నాయి. అయితే కాకినాడ నుంచి ఎంపీగా చేస్తూ ఆ పరిధిలోని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారుట.
ఎన్నికల తరువాత అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అన్నది జనసేనలో చర్చగా ఉంది మొత్తానికి 2019 లో రెండు ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసిన పవన్ ఈసారి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సీటుకు పోటీ పడతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.