Begin typing your search above and press return to search.

వారణాసిలో మంటలు ఖాయమా ?

రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించాలని ఇండియాకూటమితో పాటు ప్రతిపక్షాలు గట్టి పట్టుమీదున్నాయి

By:  Tupaki Desk   |   21 Aug 2023 4:23 AM GMT
వారణాసిలో మంటలు ఖాయమా ?
X

రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించాలని ఇండియాకూటమితో పాటు ప్రతిపక్షాలు గట్టి పట్టుమీదున్నాయి. అయితే ఇది అంత తేలికైన పనికాదని అందరికీ తెలుసు. ఎన్డీయేతో పోల్చుకుంటే ఇండియాకూటమి, ప్రతిపక్షాల మధ్య చాలా గొడవలున్నాయి. నిజానికి వీళ్ళమధ్య అనైక్యతే మోడీకి బాగా అడ్వాంటేజ్ అవుతోంది. ఇదే సమయంలో ఎన్డీయే బలమంతా నరేంద్రమోడీ మాత్రమే అని అందరికీ తెలుసు. మోడీ లేకపోతే ఎన్డీయే దాదాపు జీరోయే అన్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే రాబోయే ఎన్నికల్లో వారణాసిలో మంటలు మండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే వారణాసిలో మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ప్రియాంకగాధి పోటీచేయబోతున్నారు అనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. పోయిన ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీచేసి ఓడిపోయారు. అప్పట్లో మోడీకి 4,79 లక్షల ఓట్ల మెజారిటి వచ్చింది.

అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఉందని అనిపిస్తోంది. మోడీపై అప్పట్లో ఉన్న భ్రమలు మెల్లిగా తగ్గిపోతున్నాయి. ఇదే సమయంలో ఇండియాకూటమి, ప్రతిపక్షాలు గనుక చిత్తుశుద్దితో పనిచేస్తే ప్రియాంక గట్టి పోటీ ఇవ్వగలరు అనటంలో సందేహంలేదు. పరిస్ధితులు అనుకూలిస్తే గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్లాన్ ఏమిటంటే మోడీపైన ప్రియాంక గెలుస్తారని కాదు. నియోజకవర్గంలో మోడీని ముప్పు తిప్పలు పెట్టడమే. పోయినసారి వారణాసిలో నామినేషన్ వేసిన తర్వాత గెలుపు ధీమాతో మోడీ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రచారం చేశారు.

అయితే రాబోయే ఎన్నికల్లో మోడీకి ఆ అవకాశం ఇవ్వకూడదన్నదే కాంగ్రెస్ ప్లాన్ గా అనిపిస్తోంది. మోడీని ఎంతవీలుంటే అంత వారణాసికే పరిమితం చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్డీయే గెలుపు అవకాశాలు అంత తగ్గిపోతాయని అనుకుంటున్నారు. అందుకనే మోడీని వారణాసిలోనే ఎక్కువ రోజులు అట్టేపెట్టాలంటే ప్రియాంకగాంధి వల్లే సాధ్యమనే ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే జరిగితే వారణాసి నియోజకవర్గంలో పోటీ దేశమంతా ఆకర్షిస్తుందనటంలో సందేహమే లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.