బీజేపీ చేతిలో మహిళా బిల్లు....?
మహిళలకు చట్ట సభలలొ ముప్పయి మూడు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు మహిళా బిల్లు. ఇది చట్టం కాకుండా ఇప్పటికి పాతికేళ్ళుగా ఆగిపోయింది
By: Tupaki Desk | 4 Sep 2023 8:00 AM GMTమహిళలకు చట్ట సభలలొ ముప్పయి మూడు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు మహిళా బిల్లు. ఇది చట్టం కాకుండా ఇప్పటికి పాతికేళ్ళుగా ఆగిపోయింది. ఈ బిల్లుకు మోక్షం కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో మహిళా బిల్లును చట్టంగా ఆమోదించుకునేలా బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.
మహిళా బిల్లు కనుక ఆమోదం పొందితే చరిత్రలో బీజేపీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశంలో సగానికి పైగా ఉన్న మహిళా ఓట్లకు గురి పెట్టే బీజేపీ ఈ కీలక సమయంలో బిల్లుని ముందుకు తెస్తోంది అని అంటున్నారు. మహిళా బిల్లును సమాజ్ వాది పార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు వ్యతిరేకించాయి. ఇపుడు ఆయా పార్టీల స్టాండ్ ఏంటో చూడాల్సి ఉంది.
ఇక దేశంలో మహిళల ఓట్ల కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తాయి. అందువల్ల మహిళా బిల్లు విషయంలో విపక్షాలు అయితే నో చెప్పే పరిస్థితి ఉంటుందా అన్నది చూడాలి. ఒక వేళ ఏ పార్టీ అయినా నో చెప్పినా కూడా ఈ బిల్లుని తనకు ఉన్న మెజారిటీతో ఆమోదించుకునే బీజేపీ పావులు కదుపుతుంది అని అంటున్నారు. అదే జరిగితే మాత్రం మహిళా బిల్లు చట్టం అవుతుంది. ఆ క్రెడిట్ ని సోలోగా తన ఖాతాలో వేసుకోవడానికి బీజేపీ చూస్తుంది అని అంటున్నారు.
ప్రత్యేక సమావేశాలలో మహిళా బిల్లు అన్నది కీలకంగా మారనుంది అని తెలుస్తోంది. ఈ బిల్లుతో పాటు రేపటి ఎన్నికల్లో చట్ట సభలలొ మూడవ వంతు మహిళలకు ఇచ్చి పోటీకి నిలబెట్టాలంటే కూడా రాజకీయ పార్టీలకు అది పెద్ద టాస్క్ అవుతుంది. అదే విధంగా లోక్ సభనే తీసుకుంటే మొత్తం 543 మంది ఉన్న ఎంపీలలో 180 మంది దాకా మహిళా ఎంపీలు ఉండే అవకాశం ఉంది.
బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. బీజేపీలో మహిళా నాయకులను ముందు పెట్టి రేపటి ఎన్నికల్లో కొత్త ప్రయోగం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఇక అసలే పొత్తుల మీద ఉండే విపక్షాలకు మహిళా అభ్యర్ధుల ఎంపిక కూడా సమస్య అవుతుందని భావిస్తున్నారు.
ఇంకో వైపు చూస్తే బీజేపీ మోడీ సారధ్యంలో అధికారంలోకి వచ్చాక అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వస్తోంది. అందువల్ల మహిళా బిల్లు అన్నది మోక్షానికి నోచుకోక దశాబ్దాలుగా పడి ఉండడాన్ని కూడా సవాల్ గా తీసుకుని చట్టం చేసి చూపించాలని పట్టుదల పడుతోంది. బీజేపీ అంటే మహిళలకు అనుకూలమైన పార్టీ అని చెప్పడం ద్వారా 2024 ఎన్నికలలో గెలవాలని చూస్తోంది. ఒక విధంగా బ్రహ్మాస్త్రాన్నే బీజేపీ ఎక్కుపెడుతోంది. మహిళా సెంటిమెంట్ అన్నది రాజకీయాలలో చాలా ఇంపార్టెంట్.దాని కోసం అన్ని పార్టీలూ చూస్తూ ఉంటాయి.
అలాంటిది ఏకంగా మహిళా బిల్లుతో వారి మనసుని గెలుచుకోవాలని బీజేపీ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం విపక్షాలకు షాక్ తప్పదనే అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రత్యేక సమావేశాలలో ఏమి జరగనుందో.