Begin typing your search above and press return to search.

రామమందిరం...బీజేపీ ముందస్తుకు తధాస్తు ...?

ఇక ఈ భవ్యమైన రామమందిరం 2024 జనవరి లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నేపధ్యంలో బీజేపీ జమిలి ఎన్నికలు అంటోంది

By:  Tupaki Desk   |   5 Sep 2023 4:02 AM GMT
రామమందిరం...బీజేపీ ముందస్తుకు తధాస్తు ...?
X

రాములోరికీ బీజేపీకి చాలా అవినాభావ సంబంధం ఉంది అన్నది తెలిసిందే. బీజేపీ అయోధ్య రాముడిని ముందు పెట్టుకుని మూడు దశాబ్దాల పాటు దేశంలో రాజకీయాలను మొత్తం మార్చేలా చేసింది. 1989లో రాముడు అయోధ్యా అజెండాగా చేసుకుని రెండు సీట్ల నుంచి బీజేపీ ఎకాఎకీన 90 సీట్లకు ఎగబాకింది. ఆ తరువాత 1996 నాటికి ఏకంగా 160 సీట్లకు చేరుకుని వాజ్ పేయ్ ని దేశానికి ప్రధానిగా తొలిసారి చేసింది.

ఇక అయోధ్య రామమందిరం ఇష్యూ బీజేపీకి 2014 ఎన్నికల దాకా అలా ఉపయోగపడుతూనే ఉంది. 2019లో రెండవసారి అధికారంలోకి రావడంతో అయోధ్య ఇష్యూని బీజేపీ కోర్టు ద్వారా పరిష్కరించుకుంది. ఇక రామందిరం నిర్మాణానికి ఆటంకాలు లేకుండా పోయాయి. కరోనా విపత్తు వేళ 2020 లో ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరానికి శంకుస్థాపన చేశారు.

ఇక ఈ భవ్యమైన రామమందిరం 2024 జనవరి లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నేపధ్యంలో బీజేపీ జమిలి ఎన్నికలు అంటోంది. అయితే రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాల్సి ఉంది. దానికి జనవరి ముహూర్తంగా నిర్ణయించారు. బీజేపీ జమిలి ఎన్నికలు అనుకున్నా అవి డిసెంబర్ లో వస్తే రామమందిరం ప్రారంభానికి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బరిలో ఉంటుంది.

అంటే లోక్ సభ రద్దు అయి కేర్ టేకర్ సర్కార్ గా ఉంటుంది. అందువల్ల అది కుదిరే పని కాదు. దాంతో బీజేపీ కలల కోవేల ఆరాధ్య దేవుడు రాముడు రామ మందిరం వంటివి అస్త్రాలుగా లేకుండా ఎన్నికలు డిసెంబర్ లో వెళ్లడం సాధ్యమేనా అన్న చర్చకు తెర లేస్తోంది. ఇక జనవరిలో జరగాల్సిన రామమందిరం ముహూర్తాన్ని కూడా కొంచెం ముందుకు అంటే డిసెంబర్ లో జరిపి ప్రారంభోత్సవం చేస్తారా అన్న చర్చ కూడా ఉంది.

అలా అయితే రామమందిరం ప్రారంభం తరువాతనే లోక్ సభ రద్దు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఈలోగా చూస్తే తెలంగాణా రాజస్థాన్, మిజోరాం చత్తీ ఘడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు గడువు తీరిపోయి ఎన్నికలు ముంచుకు వస్తాయి. వాటిని ఆపి కొత్త ఏడాదిలో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలంటే ముందుగా అక్కడ రాష్ట్రపతిపాలన విధించాల్సి ఉంటుంది.

మరి బీజేపీ ప్రభుత్వం లోక్ సభ రద్దు కాకుండా ఉంటేనే ఇవన్నీ చేయగలదు. అయితే అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ని వెనక్కి జరపడానికి ఆయా రాష్ట్రాలు ఎంతవరకూ ఒప్పుకుంటాయన్నది కూడా చూడాలని అంటునారు. ఒక్క మధ్యప్రదేశ్ తప్ప అన్నింటా విపక్షాలే ప్రభుత్వంలో ఉన్నాయి.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీకి జమిలి కానీ ముందస్తు కానీ డిసెంబర్ లో పెట్టడం అంత సులువుగా అనిపించడంలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రధాని హోదాలో రామ మందిరాన్ని ప్రారంభించిన మీదటనే లోక్ సభను రద్దు చేసి ఎన్నికలు వెళ్లే చాన్స్ ఉంది అని అంటున్నారు. రాముడి అండతో మరోసారి 2024లో బీజేపీ గెలవాలని చూస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలతో కలుపుకుని జమిలి ఎన్నికలు అనుకున్నా సరే బీజేపీకి ఇపుడు ఎంతవరకూ అవకాశం ఉంది అన్న దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. మరి బీజేపీని మరోసారి రాముడు రామమందిరం కరుణిస్తారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.