బీజేపీతో పూర్తిగా గ్యాప్ . జైలు గోడల మధ్యన బాబు
కేంద్ర బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయాలను తమదైన శైలిలో మలుపు తిప్పుతున్నారా అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చకు వస్తోంది
By: Tupaki Desk | 11 Sep 2023 6:55 AM GMTకేంద్ర బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయాలను తమదైన శైలిలో మలుపు తిప్పుతున్నారా అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చకు వస్తోంది. చంద్రబాబు వంటి సీనియర్ మోస్ట్ లీడర్ ని జైలుకు పంపే విషయంలో వైసీపీ ఎంత చేసినా తెర వెనక బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉండి ఉంటుందనే అనుమానాలు గట్టిగా బలపడుతున్నాయి. దానికి కారణం బాబు అరెస్ట్ మీద ఒక్క మాట కూడా కేంద్ర బీజేపీ నుంచి రాకపోవడం. ఇక తొలి రోజు బాబు అరెస్ట్ ని ఖండిస్తూ గట్టిగా రియాక్ట్ అయిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆ తరువాత సైలెంట్ కావడం కూడా గమనంలోకి తీసుకోవాలని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో బంద్ కి టీడీపీ పిలుపు ఇస్తే బీజేపీ నుంచి సంఘీభావం ప్రకటన లేకపోవడం. పైగా టీడీపీ బంద్ కి బీజేపీ మద్దతు అంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోందని ఏకంగా పురంధేశ్వరి ఖండించడం. ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్ర బీజేపీ పెద్దలకు చంద్రబాబుకు బాగా గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు.
నిజానికి చూస్తే 2018 మొదట్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు 2019 నాటికి ఏకంగా మోడీ అమిత్ షాల మీదనే తన యుద్ధాన్ని ప్రకటించారు. దేశమంతా తిరిగి బీజేపీని ఓడించాలని అనుకున్నారు అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టి మరీ నేరుగా సమరమే చేశారు. బాబు బీజేపీకి అప్పట్లో దూరంగా ఉన్నా బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్ శిబిరంతో కలవకపోయి ఉంటే కధ వేరేగా ఉండేది. కానీ అతి ఉత్సాహం వల్లనే అలా చేశారు.
దాంతో బాబు అసలు రాజకీయం బీజేపీ పెద్దలకు అర్ధం అయింది అని అంటున్నారు. అందుకే 2019లో రెండవమారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాబుని పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు. అయితే ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలంటే బీజేపీ అండ ఉండాలని బాబు గత నాలుగేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. వాటికి కొంత కదలిక వచ్చిందని, అందుకే నీతి అయోగ్ మీటింగుతో పాటు అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో మోడీ సమావేశాలు పెట్టినపుడు చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారని అంటున్నారు.
ఇక కొద్ది నెలల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా బాబు భేటీ అయ్యారు. దీంతో ఇక ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తు కచ్చితమని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాతనే కధ మరింగ స్పీడ్ గా ముందుకు సాగింది. ఏపీలో తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండాలని బాబు కోరుకున్నారని అంటారు. ఇక బీజేపీ అయితే ఏపీలో పొత్తు ఉండాలని అధిక సీట్లు డిమాండ్ చేసింది అని అంటారు.
ఈ ప్రచారం ఇలా ఉండగానే బాబు తెలంగాణాలో తమ పార్టీ ఒంటరి పోరు అని డిక్లేర్ చేశారు. దాంతో బీజేపీతో ఎక్కడో తేడా కొట్టింది అని అంతా అనుకున్నారు. ఇక ఏపీలో పొత్తులు ఎన్నికల వేళకే కుదురుతాయని బాబు మరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఎన్డీయే భేటీకి బాబుని పిలవకుండా జనసేనను మాత్రమే కేంద్ర బీజేపీ పెద్దలు పిలవడం ద్వారా తమ ఆలోచన ఏంటన్నది తెలియచేశారు.
అయితే ఢిల్లీ వెళ్ళిన పవన్ ఏపీలో కొత్త పార్టీలు కూడా ఎన్డీయే కూటమిలో త్వరలో చేరవచ్చు అని కూడా అని ఆశావహమైన ప్రకటన చేశారు. ఇక ఇటీవల ఎన్టీయార్ వెండి నాణేన్ని రాష్ట్రపతి ఆవిష్కరించినపుడు ఢిల్లీ రాష్టపతిభవన్ కి వెళ్లిన చంద్రబాబు అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ముచ్చటించారు. దాంతో బీజేపీ పొత్తు మీద మరో మారు ఊహాగానాలు వినిపించాయి.
ఇంతలో 118 కోట్ల లెక్క చూపని సొమ్ము మీద బాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిందని మరో వార్త సంచలనం రేపింది. ఆ కేసులో ఐటీ దూకుడు చేస్తుందని, ఆ తరువాత ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని అంతా భావిస్తున్న నేపధ్యంలో సడెన్ గా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం వ్యవహారం తెర మీదకు రావడం బాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్ళిపోవడం జరిగిపోయాయి. ఎంత చెప్పుకున్నా కేంద్ర పెద్దల మద్దతు లేకుండా ఈ అరెస్ట్ జరగదని అంటున్నారు.
ఇక కేవలం 23 సీట్లు వచ్చి గతం కంటే టీడీపీ బలహీనంగా ఉన్నా కూడా బీజేపీ డిమాండ్ చేసిన సీట్లను ఇవ్వకుండా బేరాలు చేయడం, ఏపీ రాజకీయాలలో తానే మెయిన్ గా భావిస్తూ జూనియర్ పార్టనర్స్ గా బీజేపీని ట్రీట్ చేయాలని చూడడం వల్లనే పొత్తులు కుదరడం లేదు అని ఒక ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే చంద్రబాబు నమ్మకమైన మిత్రుడు కారని, రేపటి ఎన్నికల అవసరం వరకూ బీజేపీతో ఉంది ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్లేట్ ఫిరాయిస్తారన్న భయం ఆందోళన బీజేపీ పెద్దలలో ఉన్నాయని అంటున్నారు.
ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో బాబు గతంలో చక్రం తిప్పిన అనుభవం ఉన్న నేత అని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ తో కూడా గతంలో దోస్తీ చేసి ఉన్నారని అంటున్నారు. దాంతో బాబు కంటే జగన్ని నమ్ముకోవడమే బెటర్ అన్న ఆలోచనతోనే బాబు అవినీతి కేసులను వెలికి తీయడంతో వైసీపీకి ఫ్రీ హ్యాండ్ ని బీజేపీ పెద్దలు ఇచ్చారని అంటున్నారు.
ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరిని పెట్టడం అంటే బాబుకు సానుకూల సంకేతం కాదని, టీడీపీ వీక్ అయితే ఆ ప్లేస్ లోకి బీజేపీని తేవడానికి ఆమెకు ఉన్న కుటుంబ సామాజిక నేపధ్యం ఉపయోగపడతాయన్న లెక్కలతోనే బీజేపీ ఆమెకు చాన్స్ ఇచ్చింది అంటున్నారు. మొత్తం మీద తెర వెనక ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు కానీ బీజేపీ మద్దతు ఉంటే కనుక చంద్రబాబు రాజమండ్రి జైలు దాకా వెళ్లే సీన్ అయితే లేదని అంటున్నారు. మొత్తనికి ఏపీలో బీజేపీ మార్క్ పాలిటిక్స్ కి ఈ రకమైన రిజల్ట్స్ వస్తున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది మరి.