అందరు ఇక్కడే క్యాంపు వేస్తారా ?
అలాంటిది షెడ్యూల్ విడుదలైన కారణంగా పై నేతలంతా ఎన్నికలు అయ్యేంతవరకు ఇక్కడే క్యాంపు వేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం
By: Tupaki Desk | 10 Oct 2023 2:30 PM GMTఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా బీజేపీ అగ్రనేతల్లో కొందరు తెలంగాణాలోనే క్యాంపు వేయబోతున్నారు. ఇప్పటికే నరేంద్రమోడీ, అమిత్ షా రెగ్యులర్ గా తెలంగాణాలో పర్యటిస్తున్నారు. వీళ్ళకి అదనంగా విడతలవారీగా ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, బీఎల్ సంతోష్ వచ్చి మీటింగులు పెడుతునే ఉన్నారు. రెండు, మూడు రోజులుండి సీనియర్ నేతలతో మీటింగులు పెడుతు ఎక్కడో ఒక చోట బహిరంగసభలో మాట్లాడేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు.
అలాంటిది షెడ్యూల్ విడుదలైన కారణంగా పై నేతలంతా ఎన్నికలు అయ్యేంతవరకు ఇక్కడే క్యాంపు వేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వీళ్ళ ప్రధాన బాధ్యతలు ఏమిటంటే విభేదాలను పక్కనపెట్టి సీనియర్లందరినీ ఏకతాటిపైకి తీసుకురావటమే. సీనియర్లలో చాలామందికి ఎలాగూ టికెట్లిస్తారు కాబట్టి ప్రచారంతో బిజీ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి ఇతరులతో పాటు పార్టీ సాయం చాలా అవసరం. అందుకనే ఈలోగానే విభేదాలను పరిష్కరించి అందరినీ ఒకేవేదికపైకి తీసుకురావాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన.
ఈ కారణంతోనే పైన చెప్పిన ఐదుగురు ఢిల్లీ నేతలను తెలంగాణాలోనే క్యాంపువేసి అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, గెలుపు బాధ్యతలను దగ్గరుండి చూసుకోమని అమిత్ షా ఆదేశించారట. అందుకనే వీళ్ళంతా ప్రత్యేకంగా క్యాంపు వేయబోతున్నారు. విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏనుగు రవీంద్రారెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి అసంతృప్త నేతలతో మొన్నటి పర్యటనలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వీళ్ళ అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఎన్నికల్లో పూర్తిస్ధాయిలో మమేకం అయ్యేట్లుగా ఒప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి వీళ్ళందరికీ పార్టీపరంగా ప్రాధాన్యత దక్కుతునే ఉంది. వీళ్ళల్లో చాలామందికి కోరుకున్న నియోజకవర్గాలో పోటీకి టికెట్ ఇవ్వటానికి కూడా అధిష్టానం సిద్ధంగా ఉంది. వీళ్ళల్లో ఎవరికీ నిధుల సమస్య కూడా లేదు. ఒకవేళ ఉన్నా ఆ విషయాన్ని పార్టీ చూసుకుంటుంది. మరిలాంటి స్ధితిలో ఇంకా ఎందుకు వీళ్ళల్లో అసంతృప్తి ఉందో ఎవరికీ అర్ధంకావటంలేదు. దీన్ని సెట్ చేయటానికే పార్టీ పెద్దలు పై ఐదుగురికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. మరి వీళ్ళు ఎంతవరక సక్సెస్ అవుతారో చూడాల్సిందే.