Begin typing your search above and press return to search.

పవన్ - కిషన్ లకు ఒక్కరోజే టైం... కొలిక్కితెస్తారా?

చాలా రోజుల క్రితమే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతూ 32 నియోజకవర్గాల పేర్లు ప్రకటించింది జనసేన

By:  Tupaki Desk   |   26 Oct 2023 5:20 AM GMT
పవన్ - కిషన్ లకు ఒక్కరోజే టైం... కొలిక్కితెస్తారా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీఅరెస్స్ ఇప్పటికే అభ్యర్థులను, మేనిఫెస్టోనూ ప్రకటించేసి.. ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి.. ప్రచారాలను హోరెత్తించేస్తుంది. మరోపక్క ఆపరేషన్ ఆకర్ష కూడా కంటిన్యూ చేస్తుంది. ఈ సమయంలో బీజేపీ పొత్తు రాజకీయానికి తెరలేపింది.

అవును... ఇటీవల 52మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన తెలంగాణ బీజేపీ... ప్రచారంలో కాస్త వెనుకబడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో క్రౌండ్ పుల్లర్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో పొత్తుకు ప్రయత్నాలు చేసింది. దీంతో బుధవారం అమిత్ షా తో జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమయంలో వీరిద్దరికీ అమిత్ షా డెడ్ లైన్ పెట్టారని తెలుస్తుంది.

చాలా రోజుల క్రితమే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతూ 32 నియోజకవర్గాల పేర్లు ప్రకటించింది జనసేన. ఒక్క అభ్యర్థి పేరూ ప్రకటించనప్పటికీ... 32 స్థానాల పేర్లు మాత్రం వెల్లడించింది. అయితే ఇటీవల తాను ఎన్డీఏ లోనే ఉన్నానని టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం జరిగిన వారాహి యాత్రలో పవన్ ప్రకటించారు. అనంతరం తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు లక్షణ్, కిషన్ రెడ్డి... పవన్ తో భేటీ అయ్యారు. కలిసి పోటీ చేసే విషయాలపై చర్చించినట్లు తెలిపారు!

ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లు ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో సుమారు 40 నిమిషాల భేటీ అనంతరం... తాను శుక్రవారం హైదరాబాద్‌ కు వస్తున్నానని, ఆలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని అమిత్‌ షా వారికి సూచించినట్లు తెలిసింది! అందుకు కిషన్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ అంగీకరించారని.. ఈ రోజంతా అదేపనిమీద ఉండబోతున్నారని అంటున్నారు.

అయితే... తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలంటే... హైదరాబాద్‌ సహా బోర్డర్ జిల్లాల్లో జనసేన 30కి పైగా సీట్లు అడుగుతున్నారని కథనాలొస్తున్నాయి. అయితే... ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదని, అన్ని సీట్లు ఇవ్వకపోయినా.. పరిస్థితులకు తగ్గట్లుగా తీసుకుని కలిసి ముందుకు వెళ్లాలని బీజేపీ పెద్దలు పవన్ కు సూచించారని అంటున్నారు! దీంతో... పవన్ కు బీజేపీ సింగిల్ డిజిట్ సీట్లు ఇస్తుందా.. లేక, 30కి పైగా స్థానాల్లో అవకాశం కల్పిస్తుందా అనేది చర్చనీయాంశం అయ్యింది.

అయితే ఈ భేటీకి ముందు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా... పవన్‌ కల్యాణ్‌ తో హైదరాబాద్‌ లో ప్రాథమికంగా చర్చించామని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన - బీజేపీలతో టీడీపీ కూడా కలిసివస్తుందా అన్న ప్రశ్నకు కిషన్‌ రెడ్డి స్పందించారు. జనసేన ఒక్కటే ఎన్డీఏ భాగస్వామి అని తేల్చి చెప్పారు! దీంతో... ఏపీలో పొత్తుల వ్యవహారం ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.. ఎలా కొలిక్కి వస్తుందనేది చర్చనీయాంశం అయ్యింది.

ఏది ఏమైనా... ఇవాళ రేపట్లో తెలంగాణలో బీజేపీ - జనసేనల పొత్తు వ్యవహారంపై పరిపూర్ణమైన స్పష్టతతో పాటు.. ఎన్నెన్ని స్థానాల్లో పోటీచేయబోతున్నాయని అనే విషయంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది!