Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ భారీ దౌత్య విజయం.. ఖతర్లో మనోళ్లకు తప్పిన మరణశిక్ష

వారికి విధించిన మరణశిక్షను తగ్గిస్తూ.. ఖతర్ న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:17 AM GMT
మోడీ సర్కార్ భారీ దౌత్య విజయం.. ఖతర్లో మనోళ్లకు తప్పిన మరణశిక్ష
X

నిజానికి చిన్న అంశాలకు భారీ ప్రాధాన్యతను ఇచ్చే మీడియా.. కొన్ని అంశాలను మాత్రం పెద్దగా ఫోకస్ చేయదన్న ఆరోపణ పలువురి నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి వాదన బలం చేకూరే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మోడీ సర్కారు సాధించిన అతి పెద్ద దౌత్య విజయంగా దీన్ని చెప్పుకోవాలి. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయి.. ఖతర్ లో మరణశిక్ష పడిన భారత్ కు చెందిన ఎనిమిది మంది మాజీ సీనియర్ నేవీ అధికారులకు గొప్ప ఊరట లభించింది.

వారికి విధించిన మరణశిక్షను తగ్గిస్తూ.. ఖతర్ న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. మరణ శిక్షకు బదులుగా జైలుకు సవరించిన ఈ తీర్పుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజాగా జైలుశిక్షకు పరిమితమైన తీర్పులో.. ఎంతకాలం జైలు అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దుబాయ్ లో జరిగిన కాప్ 28 సదస్సు వేదికగా ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని ప్రధాని మోడీ కలిసిన కొన్ని వారాలకే వెలువడిన ఈ కోర్టు తీర్పు ఆసక్తికరంగా మారింది.

తాజా తీర్పు నేపథ్యంలో కేంద్రం స్పందించింది. తాజా తీర్పుపైనా.. జైలుశిక్ష రద్దు కాకపోవటంపైనా ఏం చేయాలన్నదానిపై లా టీంలు.. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా పేర్కొన్నారు. తీర్పు వెలువడే సమయానికి భారత రాయబారి కోర్టులోనే ఉన్నట్లుగా చెబుతున్నారు. తీర్పు పత్రాలు చూస్తే కానీ.. జైలుశిక్షకు సంబంధించిన వివరాలపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. నిజానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ భారత నేవీ అధికారులు ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేసినట్లుగా చెబుతారు.

అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదన్నది భారత్ వాదన. ఎందుకంటే ఖతర్ జైల్లో ఉన్న మాజీ అధికారులు నేవీలో అత్యున్నత హోదాలో పని చేసి రిటైర్ అయిన వారు.అరెస్టు నాటికి వీరంతా ఖతర్ సైనిక దళాలకు శిక్షణ తదితర సేవలు అందించే దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ అనే ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. గూఢచర్యం కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో ఒకరు ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు.

గత ఏడాది ఆగస్టులో వీరిని అరెస్టు చేశారు. అక్టోబరులో వీరికి మరణశిక్ష విధించినట్లుగా తీర్పు వచ్చింది. విచారణ సందర్భంగా పలుమార్లు బెయిల్ పిటిషన్లు రిజెక్టు అయ్యాయి. గత నెలలో మరణశిక్ష తగ్గింపునకు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు సానుకూలంగా స్పందించింది.తాజాగా.. మరణశిక్షను రద్దు చేస్తూ జైలుశిక్షకు పరిమితం చేసినట్లుగా వారతలు వచ్చాయి.

అయితే.. వీరిందరి జైలుశిక్షలు రద్దై.. భారత్ కు తిరిగి రావాలన్నదే మోడీ సర్కారు లక్ష్యంగా చెబుతున్నారు. ఏమైనా.. తక్షణ ముప్పుగా ఉండే మరణశిక్షను రద్దు చేయటం దౌత్యపరంగా సాధించిన చక్కటి విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. మోడీ ప్రభుత్వమే కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం వీరంతా క్షేమంగా దేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.