Begin typing your search above and press return to search.

బీజేపీ కొత్త నినాదం ఏపీ లో డిపాజిట్లు కోసమేనా ?

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో జనాలను ఆకర్షించేందుకు ఏపీ బీజేపీ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నది

By:  Tupaki Desk   |   3 Jan 2024 4:30 PM GMT
బీజేపీ కొత్త నినాదం ఏపీ లో డిపాజిట్లు కోసమేనా ?
X

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో జనాలను ఆకర్షించేందుకు ఏపీ బీజేపీ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నది. అదేమిటంటే బీసీ నినాదం. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతే ముఖ్యమంత్రి అవుతారనే నినాదాన్ని కొత్తగా మొదలుపెట్టింది. బీజేపీ అధికారంలోకి వస్తే అన్న మాటే చాలామందికి పెద్ద జోక్ గా ఉంటుంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులే లేని పార్టీ కూడా అధికారంలోకి వస్తే అని ఆలోచిస్తోందంటే విచిత్రమనే చెప్పాలి.

ఇలాంటి స్లోగనే తెలంగాణా ఎన్నికల్లో కూడా ఇచ్చింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. బీసీ నేత బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తీసేసి కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవటం పెద్ద జోక్ అయిపోయింది. ఇపుడు ఇదే నినాదంతో ఏపీ ఎన్నికలను దున్నేయాలని కమలనాదులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 7వ తేదీన వైజాగ్ లో భారీ బహిరంగసభ ఏర్పాటుచేయబోతున్నారు. బీసీలకు బీజేపీ ఇస్తున్న, ఇవ్వబోతున్న ప్రాధాన్యత గురించి బహిరంగసభలో నేతలు చెప్పబోతున్నారు.

గట్టిగా మాట్లాడాలంటే ఏపీ బీజేపీలో గట్టి నేతలే లేరు. అలాంటిది బీసీ నేతలు ఇంకెక్కడ దొరుకుతారు. ప్రజాబలం ఉన్న నేతల కోసం టార్చిలైట్ వేసి వెతకాల్సిందే. పార్టీలో చాలామంది పెద్ద లీడర్లున్నారు కాని వాళ్ళలో చాలామంది మీడియా సమావేశాల్లో మాట్లాడేందుకు మాత్రమే పనికొస్తారు. పార్టీ తరపున క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేసిందిలేదు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి సొంతబలంతో వెయ్యి ఓట్లు కూడా సాధించలేరు. ఇంతకుముందు పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన సోమువీర్రాజు అయినా ఇప్పటి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అయినా ఇదే తంతు.

వీళ్ళు పోటీచేస్తే తమ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరు. ఇలాంటి నేతలంతా చాలా ప్రముఖులుగా పార్టీలో చేలామణి అయిపోతున్నారు. కాబట్టి గట్టి బీసీనేత లేని పార్టీ బీసీ నినాదాన్ని కాయిన్ చేయాలని అనుకుంటే ఏమిటి ఉపయోగమో అర్ధంకావటంలేదు. 7వ తేదీ బహిరంగసభకు కూడా కేంద్రంలోని ప్రముఖ బీసీ నేతలను రప్పిస్తున్నారంటేనే పారిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. మరి కొత్తగా ఇవ్వబోతున్న బీసీ నినాదం ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.