కాశ్మీర్ లో కమలం కల తీరుతుందా ?
మొత్తానికి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు నగారా మోగింది. జమ్ము కాశ్మీర్ కి సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి
By: Tupaki Desk | 16 Aug 2024 2:30 PM GMTమొత్తానికి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు నగారా మోగింది. జమ్ము కాశ్మీర్ కి సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల కానున్నాయి. దాంతో దేశంలో ఆసక్తికరమైన ఎన్నికలకు తెర లేస్తోంది.
ఎందుకు ఆసక్తి అని చెప్పాలంటే కాశ్మీర్ లో ప్రజా ప్రభుత్వం అన్నది లేదు. దాదాపుగా ఆరేడు ఏళ్ళు అయిపోయింది. 2014లో బీజేపీకి 25 సీట్లు పీడీఎఫ్ కి 28 సీట్లు వస్తే కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయితే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగలేదు. మొదట పీడీఎఫ్ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 2015లో మరణించడంతో ఆయన కుమార్తె మొహబూబా ముఫ్తీ బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. 2018 జూన్ దాకా సాగిన ఆ ప్రభుత్వం బీజేపీ మద్దతు ఉపసంహరణతో కుప్ప కూలింది
ఇక 2019 ఆగస్ట్ 5న జమ్మూ కాశ్మీర్ కి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు కేంద్ర పాలనలోకి తీసుకుని వచ్చారు. సరిగ్గా అయిదేళ్ల పాటు కేంద్రం పర్యవేక్షణలో పాలన సాగింది. ఈ మధ్యలో స్థానిక ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీఫ్ కలసి కూటమి కట్టి 105 లోకల్ బాడీస్ ని గెలిచాయి. అలా బీజేపీకి గట్టి ఝలక్ ఇచ్చాయి.
ఆ తరువాత 2024 మేలో జరిగిన జమ్మూ కాశ్మీర్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఒక సీటు ఇండిపెండెంట్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ కి ఒక్క సీటూ దక్కలేదు. అలాగే పీడీఫ్ కూడా గెలవలేదు.
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే గెలిచి సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. కానీ జమ్మూలో 43 సీట్లు ఉంటే కాశ్మీర్ లో 47 సీట్లు ఉన్నాయి. జమ్మూలో మూడు సీట్లు పెరిగాయి. జమ్మూలోనే బీజేపీకి పట్టు ఉంది. ఇక బీజేపీ ఓట్ల శాతం 2008లో 12.45 శాతం ఉంటే 2024 ఎంపీ ఎన్నికల నాటికి అది 23 శాతానికి పెరిగింది.
దాంతో పాటు ఓటింగ్ కూడా ఎంపీ ఎన్నికల్లో బాగా జరిగింది. ప్రజలు మార్పు కోరుకుంటే తాము అధికారంలోకి రావచ్చు అని బీజేపీ చూస్తోంది. ఇక ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమితో కాకుండా విడిగా పోటీ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు తీరి సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు ఎన్నికవ్వాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేయనుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఒకనాటి సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో 2022 సెప్టెంబర్ 27న పార్టీని ప్రకటించారు. ఈ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. మరో వైపు పీడీఎఫ్ కి 8 శాతం ఓట్లు కాంగ్రెస్ కి తొమ్మిది శాతం ఓట్లు లభించాయి.
జమ్మూ కాశ్మీర్‌లో పోటీ ప్రధానంగా నేషనల్ కాన్ఫరెన్స్ కి బీజేపీకి మధ్యే ఉంది అని లోక్ సభ ఎన్నికలు నిరూపించాయి. జమ్మూలో బీజేపీ పట్టు సాధిస్తోంది కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కి ఆధిపత్యం స్పష్టంగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉంది.
జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 87.09 లక్షల మంది ఓటర్లు 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. అంతే కాదు జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 3.71 లక్షల మంది మొదటి సారి ఓటర్లు ఉన్నారు. దీంతో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అదే కాదు ఆర్టికల్ 370 రద్దు తర్వాత అలాగే, దశాబ్దం తర్వాత అంటే 2014 తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి.
కాబట్టి దేశమంతా ఈ ఎన్నికలను చూస్తుంది. అలాగే దాయాది పాకిస్థాన్ అలాగే పొరుగు దేశం చైనా కూడా ఈ ఎన్నికలను నిశిత పరిశీలన చేస్తాయి. ఈ ఎన్నికల్లో కమలం కల నెరవేర్చుకుని కాశ్మీర్ ని చేజిక్కుంచుంటుదా అన్నది చూడాల్సి ఉంది. అంతే కాదు అసలు 370 ఆర్టికల్ ని రద్దు చేసింది. అయిదేళ్ళ పాటు కేంద్ర పాలనలో ఉంచడం అన్నీ కూడా పరిస్థితిని సానుకూలం చేసుకునేందుకే కానీ జమ్మూలో హిందువుల మద్దతు బీజేపీకి ఉన్నా కాశ్మీర్ ముస్లింలది ఆధిపత్యం. అలా నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ సీట్లు గెలిస్తే ఎలా అన్నది చూడాలి బీజేపీ అయితే నమ్మకంగా బరిలోకి దిగుతోంది.