Begin typing your search above and press return to search.

సార్వత్రిక ఎన్నికల వేళ షాక్.. ఆ స్టేట్ లో బీజేపీ సర్కారు మైనార్టీలోకి!

ఊహించని షాకులు ఇవ్వటమే కానీ తీసుకోవటం అలవాటు లేని భారతీయ జనతాపార్టీకి సార్వత్రిక ఎన్నికల వేళ అనూహ్య అనుభవాన్ని ఎదుర్కొనే పరిస్థితి.

By:  Tupaki Desk   |   8 May 2024 4:28 AM GMT
సార్వత్రిక ఎన్నికల వేళ షాక్.. ఆ స్టేట్ లో బీజేపీ సర్కారు మైనార్టీలోకి!
X

ఊహించని షాకులు ఇవ్వటమే కానీ తీసుకోవటం అలవాటు లేని భారతీయ జనతాపార్టీకి సార్వత్రిక ఎన్నికల వేళ అనూహ్య అనుభవాన్ని ఎదుర్కొనే పరిస్థితి. హర్యానాలో ఉన్న బీజేపీ సర్కారు ఇప్పుడు మైనార్టీలోకి జారిపోయింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూలే ప్రమాదం లేకున్నా.. ఆ దిశగా సాగుతున్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీశాయని చెప్పాలి. ఇటీవల కాలంలో తాము గురి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు కుప్పకూలిపోవటం.. లేదంటే మైనార్టీల్లోకి జారిపోవటం.. ఆ రాష్ట్రాల్లో బీజేపీ అండతో ప్రభుత్వాలు నడిచేలా పావులు కదపటం అలవాటైన మోడీషాలకు హర్యానా ఎపిసోడ్ సరికొత్త అనుభవాన్ని మిగల్చిందని చెప్పాలి.

సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలోని బీజేపీ సర్కారు అనూహ్య రీతిలో మైనార్టీలోకి పడిపోయింది. దీనికి కారణం.. ప్రభుత్వానికి అండగా నిలిచిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తాజాగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని వెల్లడించటంతో బీజేపీ సర్కారు చిక్కుల్లో పడిన పరిస్థితి. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సాయబ్ సింగ్ సైనీ సర్కారుకు ఇప్పటికిప్పుడు ముప్పు వాటిల్లే అవకాశం లేకున్నా.. చేతిలో ఉన్న అధికారం చేజారే పరిస్థితి లేకున్నా.. ఇప్పుడున్న పరిస్థితి కంటిన్యూ అయితే.. మరికొద్ది నెలల్లో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని.. కాంగ్రెస్ కు తమ మద్దతు తెలియజేస్తున్నట్లుగా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు వెల్లడించారు. రైతులకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర సమస్యల నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంతకీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయానికి వస్తే సోంబిర్ సాంగ్వాన్.. రణదీర్ గొల్లెన్.. ధరంపాల్ గోండర్ లు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్ ల సమక్షంలో ఈ ముగ్గురు ఉమ్మడి ప్రకటన చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇంతకాలం వీరు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.

హర్యానా అసెంబ్లీ విషయానికి వస్తే మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏదైనా పార్టీకి 46 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో 88 మంది సభ్యులే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రంజిత్ చౌతాలా ఇటీవల రాజీనామా చేశారు. బీజేపీకి కేవలం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. పది మంది ఎమ్మెల్యేలు ఉన్న జేజేపీ.. ఇతర ఇండిపెండెంట్లతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ మధ్యన జేజేపీ తన మద్దతను ఉపసంహరించుకుంది. మరికొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని వీడారు. దీంతోనయాబ్ సింగ్ సర్కారు మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఈ మధ్యనే అసెంబ్లీలో నయాబ్ సింగ్ సర్కారు బలపరీక్షను ఎదుర్కొని బయటపడ్డారు. నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో బలపరీక్షను ఎదుర్కొని.. అందులో సక్సెస్ అయితే మరో ఆర్నెల్ల వరకు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశం లేదు. దీంతో.. గడువు తీరే వరకు బీజేపీ సర్కారు చేతి నుంచి అధికారం చేజారే ప్రమాదం ప్రస్తుతానికైతే లేదని చెప్పాలి.