కీలక నియోజకవర్గంలో స్టార్ హీరోను పక్కనపెట్టి గెలవగలదా?
స్టార్లపైన ఆధారపడకుండా బీజేపీ ఒక్కసారి కూడా గురుదాస్ పూర్ లో గెలుపొందలేదు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో బీజేపీ తొలిసారి 1998లో గెలిచింది
By: Tupaki Desk | 2 April 2024 12:30 AM GMTపంజాబ్ లో పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న లోక్ సభా నియోజకవర్గం.. గురుదాస్ పూర్. దేశ సరిహద్దులో, అందులోనూ పాకిస్థాన్ సరిహద్దులో ఉండటంతో ఈ నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా సుప్రసిద్ధ బాలీవుడ్ స్టార్ హీరోలు వినోద్ ఖన్నా నాలుగుసార్లు, సన్నీడియోల్ ఒకసారి గురుదాస్ పూర్ ఎంపీలుగా వ్యవహరించారు. వినోద్ ఖన్నా, సన్నీడియోల్ ఇద్దరూ బీజేపీ తరఫున ఎంపీలుగా గెలిచారు.
ప్రస్తుతం గురుదాస్ పూర్ ఎంపీగా సన్నీడియోల్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్టార్ హీరో బీజేపీ తరఫున బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ జక్కర్ పైన 82 వేలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో సన్నీడియోల్ కు బీజేపీ సీటు నిరాకరించింది. మాజీ ఎమ్మెల్యే దినేష్ సింగ్ కు టికెట్ ఇచ్చింది.
స్టార్లపైన ఆధారపడకుండా బీజేపీ ఒక్కసారి కూడా గురుదాస్ పూర్ లో గెలుపొందలేదు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో బీజేపీ తొలిసారి 1998లో గెలిచింది. నాడు బాలీవుడ్ ఒకప్పటి అగ్ర నటుడు వినోద్ ఖన్నాను బరిలోకి దింపి బీజే పీ గెలుపు రుచి చవి చూసింది. 1999, 2004 ఎన్నికల్లోనూ వినోద్ ఖన్నానే బీజేపీ తరఫున విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసిన వినోద్ ఖన్నా కేవలం 8 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి వినోద్ ఖన్నా గెలిచారు.
ఇక 2019లో బీజేపీ ప్రముఖ సినీ నటుడు, ధర్మేంద్ర కుమారుడయిన సన్నీడియోల్ ను బరిలోకి దింపింది. ప్రధాని మోదీ గాలిలో సన్నీడియోల్ సులువుగా గెలుపొందారు.
ఇలా ఇప్పటివరకు సినీ నటులను బరిలోకి దింపి మాత్రమే గెలుపొందుతూ వస్తున్న బీజేపీ తొలిసారి ఇందుకు విరుద్ధంగా ఒక మాజీ ఎమ్మెల్యే దినేష్ సింగ్ కు సీటు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
తొలిసారి బాలీవుడ్ స్టార్ వినోద్ ఖన్నా 1998లో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి)తో పొత్తుతో 1,06,833 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వినోద్ ఖన్నా ఇక్కడ దిగడానికి ముందు కాంగ్రెస్ నాయకురాలు సుఖ్ బున్స్ కౌర్ భిందర్ గురుదాస్ పూర్ సీటును వరుసగా ఐదుసార్లు (1980, 1984, 1989, 1991, 1996) గెలుచుకున్నారు. ఆ తర్వాత వినోద్ ఖన్నా చేతిలో ఆమె వరుసగా మూడుసార్లు (1998, 1999, 2004) ఓడిపోయారు.
ఈ క్రమంలో వినోద్ ఖన్నా 1999 ఎన్నికలలో భిందర్ పై కేవలం 1,399 ఓట్ల తేడాతోనే గెలుపొందారు. కాగా వినోద్ ఖన్నా గురుదాస్ పూర్ లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రావి నది, ఇతర నీటి వనరులపై అనేక వంతెనలను నిర్మించారు. అనేక రహదారుల నిర్మాణానికి కృషి చేశారు. దీంతో ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
2014 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన వినోద్ ఖన్నా 2017లో మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికలో పారిశ్రామికవేత్త అయిన సవర్న్ సింగ్ సలారియాకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఆయన 1.96 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి, నాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాఖర్ చేతిలో ఓడిపోయారు.
దీంతో బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బాలీవుడ్‌పై పడింది. ఈసారి గురుదాస్ పూర్ నుంచి నటుడు సన్నీడియోల్ ను బరిలో దింపి విజయం సాధించింది.
అయితే ఈసారి ఆయనకు సీటు ఇవ్వకపోవడానికి ఆసక్తికర కారణాలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచాక సన్నీడియోల్ సెప్టెంబర్ 2020లో మాత్రమే గురుదాస్ పూర్ వెళ్లారు. ఇంతవరకు ఆయన అక్కడ పర్యటించలేదు. దీంతో ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన బీజేపీ అధిష్టానం సన్నీడియోల్ ను పక్కనపెట్టిందని అంటున్నారు. అలాగే తన సహజ శైలికి విరుద్ధంగా బాలీవుడ్ పైన ఆధారపడకుండా మాజీ ఎమ్మెల్యే దినేష్ సింగ్ ను బరిలోకి దింపడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఇప్పటివరకు స్టార్ హీరోలతోనే నెట్టుకొచ్చిన బీజేపీ ఈసారి వారు లేకుండా విజయం సాధించగలదో, లేదో వేచిచూడాల్సిందే.