ఖైరతాబాద్ పైనే 'కమలం' కన్నెందుకు ?!
పార్టీ మారిన నేపథ్యంలో దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయాలన్నది బీజేపీ డిమాండ్.
By: Tupaki Desk | 4 July 2024 11:30 PM GMTతెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ ఎనిమిది స్థానాలు గెలుచుకుని పాత స్థానాలను రెట్టింపు చేసుకున్నది. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు, తర్వాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలను వదిలేసి కేవలం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. పార్టీ మారిన నేపథ్యంలో దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయాలన్నది బీజేపీ డిమాండ్.
ఖైరతాబాద్ శాసనసభ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ 67368 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డిపై 22010 ఓట్ల మెజారిటీతో విజయం సాదించాడు. అయితే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ కు అధికారం దక్కిన నేపథ్యంలో వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో 49 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.
అయితే ఇప్పటి వరకు ఆరు మంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరితే బీజేపీ ఒక్క దానం మీదనే ఎందుకు ఫిర్యాదు చేసింది అని ఆరాతీస్తే ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ వెలుగులోకి వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో దానం నాగేందర్ కు 67,368 ఓట్లు వచ్చాయి. బీజేపీ అప్పుడు 38094 ఓట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 73,663 ఓట్లు రావడం విశేషం.
అందుకే దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడితే ఇక్కడ జరిగే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించవచ్చు అన్నది బీజేపీ ఆలోచన. బీఆర్‌ఎస్ ఫిర్యాదుకు అదనంగా ఈ విషయంలో బీజేపీ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ జాప్యం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని బీజేపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.