Begin typing your search above and press return to search.

బీజేపీ హిందూత్వ జెండా ... కాంగ్రెస్ లౌకిక అజెండా...!

దేశంలో లోక్ సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. రెండు జాతీయ పార్టీల నాయకత్వాన రెండు కూటములు మరోసారి తలపడబోతున్నాయి.

By:  Tupaki Desk   |   15 Jan 2024 2:30 PM GMT
బీజేపీ హిందూత్వ జెండా ... కాంగ్రెస్ లౌకిక అజెండా...!
X

దేశంలో లోక్ సభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. రెండు జాతీయ పార్టీల నాయకత్వాన రెండు కూటములు మరోసారి తలపడబోతున్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే అలాగే కాంగ్రెస్ లీడర్ షిప్ లో ఇండియా కూటమి గట్టిగానే ఈసారి ఎన్నికల యుద్ధం చేయనున్నాయి. ఇక ఫిలాసఫీ విషయంలో కూడా ఎవరివి వారికే ఉన్నాయి.

బీజేపీ మొదటి నుంచి హిందూత్వనే అస్త్రంగా చేసుకుని ముందుకు పోతోంది. అదే కాంగ్రెస్ లౌకిక వాదాన్ని బలంగా వినిపిస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హిందూత్వ మీద సాఫ్ట్ కార్నర్ తో వెళ్ళింది. రిజల్ట్ మాత్రం మళ్లీ తేడా కొట్టింది. దాంతో ఈసారి ఎలాంటి శషబిషలకు తావు ఇవ్వకుండా తమ రూట్లో సెక్యులర్ జెండానే ఎత్తాలని చూస్తోంది.

అందుకే అయోధ్య రామ మందిరం ప్రారంభానికి కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానాలు వెళ్ళినా కూడా ఆ పార్టీ నుంచి ఎవరూ అటెండ్ కాదలచుకోలేదు అని అంటున్నారు. పైగా బీజేపీ తన సొంత కార్యక్రమంగా దాన్ని నిర్వహించడం పలువురు పీఠాధిపతులు కూడా బీజేపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టడంతో కాంగ్రెస్ ధైర్యంగానే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే కర్నాటక, తెలంగాణాలో జరిగిన ఎన్నికల ఫలితాలతో కూడా కాంగ్రెస్ వైఖరిలో భారీ మార్పు వచ్చింది అని అంటున్నారు. కర్నాటక తెలంగాణాలో పెద్ద ఎత్తున మైనారిటీలు కాంగ్రెస్ కే ఓటేసారు. దేశంలో ట్రూ సెక్యులరిస్ట్ పార్టీగా కాంగ్రెస్ ని వారు గుర్తిస్తున్నారు. ఇక 2014 నాటి కంటే కూడా 2024 ఎన్నికల నాటికి బీజేపీ ప్రాభవం తగ్గుతోందని అదే టైం లో తటస్థులు మేధావి వర్గాలు చదువరులు కూడా బీజేపీ తరహా హిందూత్వకు దూరంగా ఉంటున్నారు అని కాంగ్రెస్ విశ్లేషించుకుంటోంది.

హిందూమతం మీద గౌరవం ఉందని అదే సమయంలో బీజేపీ తరహా మతం తో కూడిన రాజకీయాలకు మెజారిటీ మతం ప్రజలు కూడా అంగీకరించడం లేదని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. దాంతో పాటు రాహుల్ భారత్ జోడో యాత్రలో కూడా సెక్యులరిస్టుల నుంచి మంచి మద్దతు లభించిందని గుర్తు చేస్తున్నారు. అలాగే భారత్ న్యాయ యాత్ర పేరిట రెండవ సారి యాత్రకు రాహుల్ జనవరి 14 నుంచి శ్రీకారం చుట్టారు.

ఇంకో వైపు ఈశాన్య రాష్ట్రంగా ఉన్న మణిపూర్ లో గత కొన్ని నెలలుగా పౌరుల హక్కులకు భంగం కలిగేలా చర్యలు జరగడం దాని మీద కేంద్రం తీసుకున్న చర్యలు ఏవీ పెద్దగా లేవని కాంగ్రెస్ ఆరోపించడం రాహుల్ కూడా తన రెండవ దశ యాత్రకు మణిపూర్ నే వేదికగా ఎంచుకోవడం ఇవన్నీ చూస్తూంటే కాంగ్రెస్ సెక్యులర్ బాటలో నడవాలని డిసైడ్ అయింది అని అంటున్నారు.

అయిదేళ్ళ ముందు చూస్తే అప్పటి ఎన్నికల్లో గుళ్ళూ గోపురాలు తిరిగిన రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ హిందూత్వకు తాము పెద్ద పీట వేస్తమని చెబుతూ బీజేపీతో పోటీ పడ్డారు. అయినా హిందూత్వ ఓట్లు అన్నీ బీజేపీకే వెళ్లాయి.

దాంతో తాము నమ్ముకున్న ఫిలాసఫీతోనే 2024 ఎన్నికలను ఫేస్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని అంటున్నారు. ఇక ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ కూడా లౌకిక వాదానికే కట్టుబడి ఉన్నవని అంటున్నారు. ఈ మొత్తం సీన్ చూసినపుడు బీజేపీ హిందూత్వ కార్డు తో కాంగ్రెస్ సెక్యులర్ కార్డు ఏ మేరకు పోటీ పడుతుంది 2024 రిజల్ట్స్ ఎలా ఉంటాయన్నది ఆసక్తిని కలిగిస్తున్నాయి.