Begin typing your search above and press return to search.

దేశంలో 30వ రాష్ట్రం.. కశ్మీర్ కాదు.. తూర్పు సరిహద్దున?

అయితే, వీటి మధ్యలోనే జమ్మూ కశ్మీర్ ను రెండుగా విభజించి కశ్మీర్-లద్దాఖ్ అంటూ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది మోదీ ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   25 July 2024 5:30 PM GMT
దేశంలో 30వ రాష్ట్రం.. కశ్మీర్ కాదు.. తూర్పు సరిహద్దున?
X

దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ... ఏడు దశాబ్దాల పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. మరి తదుపరి ఏమిటి..? ఇక ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఆగిపోయినట్లేనా? దీనికి సమాధానం.. కాదు అని చెప్పాలి. తెలంగాణలాగే పూర్వాంచల్, డార్జిలింగ్ సహా అనేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఇవేమీ సాకారం కాలేదు. అయితే, వీటి మధ్యలోనే జమ్మూ కశ్మీర్ ను రెండుగా విభజించి కశ్మీర్-లద్దాఖ్ అంటూ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది మోదీ ప్రభుత్వం. ఇది ఓ విధంగా సాహసోపేతమే. మరి 30వ రాష్ట్రం ఏర్పడితే కశ్మీర్, లద్దాఖ్ లలో ఏదో ఒకటి కావాలి. వీటికి త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఈలోగానే కీలక పరిణామం సంభవించేలా ఉంది.

తూర్పున కీలక మార్పులు..

దేశంలో తూర్పున ఉండే పశ్చిమ బెంగాల్ భౌగోళికంగా బంగ్లాదేశ్ తో సుదీర్ఘ సరిహద్దును కలిగి ఉంది. రాజకీయంగా కేంద్రంలోని బీజేపీ సారథ్య ఎన్డీఏ ప్రభుత్వానికి బద్ధ విరోధి అయిన మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ లో 15 ఏళ్లుగా పరిపాలన సాగిస్తోంది. పదేళ్లుగా మోదీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ విభజనకు మోదీ సర్కారు ఎత్తులు వేస్తున్నదనే ప్రచారం జరుగుతోంది.

ముందుగా యూటీ..

ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలతో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి కొందరు భారత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందనే కథనాలూ వచ్చాయి. వీరికి ఆశ్రయం కల్పిస్తామని మమతా బెనర్జీ ఓ అసంబద్ధ ప్రకటన చేశారు. కాగా.. ఇప్పుడు బెంగాల్ ను కేంద్రం ముందుగా యూనియన్ టెరిటరీ (కేంద్రపాలిత ప్రాంతం)గా చేయనుందనే ప్రచారం జరుగుతోంది. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ బుధవారం ప్రధాని మోదీని కలిసి.. ఉత్తర బెంగాల్ ను విభజించి ఈశాన్య భారత్ లో కలపాలని ప్రతిపాదించారు. ఉత్తర బెంగాల్ అంటే ఏదో కాదు.. డార్జిలింగ్, మాల్దా, కూచ్ బెహార్, జల్పాయ్ గురి, ఉత్తర, దక్షిణ దినాజ్ పూర్ లతో కూడిన ‘‘బాటిల్ నెక్’’ ప్రాంతం. మిగతా దేశంతో ఈశాన్య భారతాన్ని కలిపే అత్యంత సన్నటి మార్గం ఇది. ఈ ప్రాంతాలతో డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. పెద్దఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. చివరకు స్వయంప్రతిపత్తి కల్పించారు. ఇప్పుడు పాలన, కల్చరల్, సంక్షేమం, ఆర్థిక న్యాయం డిమాండ్లతో ఈశాన్య రాష్ట్రాలతో కలపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేయడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. కావాలనే దీనిని తెరపైకి తెచ్చారనే వాదన వస్తోంది. ముందుగా యూటీ ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను తీరుస్తారనే వాదన వినిపిస్తోంది.

ఉత్తర బెంగాల్ ప్రత్యేకతను బ్రిటిషర్లూ గుర్తించారు. ప్రత్యేకంగా పాలించారు. టీ తోటలు, సహజ వనరులు, డార్జిలింగ్ వంటి పర్యటక ప్రాంతాలు దీని సొంతం. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ తోనూ సరిహద్దులు ఉన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే ఉత్తర బెంగాల్ లో డార్జిలింగ్, కలింపాంగ్, జల్పాయ్ గుడి, అలీపుర్దార్, కూచ్ బెహార్ ఉంటాయి. ఉత్తర దక్షిణ దినాజ్ పూర్, మాల్దాలోని కొన్ని ప్రాంతాలూ కలుస్తాయి. ఇక్కడి ప్రజలపై నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ జీవన విధాన ప్రభావం ఉంటుంది. బెంగాల్ తో పోలిస్తే ఈశాన్య భారత్ తోనే వీరికి సంబంధాలు అధికం.