బీజేపీ.. జనసేన పోటీ చేసే ఎంపీ స్థానాలివే
అసెంబ్లీ సీట్ల విషయాన్ని పక్కన పెడితే.. లోక్ సభా స్థానాల విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 12 March 2024 4:49 AM GMTఏపీలో పొత్తు ప్రహసనం ముగిసింది. ఇప్పటివరకు సాగిన అంచనాలకు ఫుల్ స్టాప్ పడింది. లెక్కలు ఫైనల్ అయ్యాయి. అంతేకాదు.. లెక్కలకు అనుగుణంగా ఏ పార్టీ ఎక్కడి నుంచి? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న దానిపైనా క్లారిటీకి వచ్చేశారు. అసెంబ్లీ సీట్ల విషయాన్ని పక్కన పెడితే.. లోక్ సభా స్థానాల విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
బీజేపీ కోరుకున్న ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. అధికారికంగా వెల్లడి కానప్పటికీ, విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్ సభా స్థానాల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్లుగా చెబుతున్నారు.
బీజేపీ పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాల్లో రెండు స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామక్రిష్ణం రాజులు పోటీ చేయనున్నారు. మిగిలిన నాలుగు ఎంపీ స్థానాలకు బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు వీలుగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ రోజు జాతీయ స్థాయిలో బీజేపీ తన రెండో జాబితా లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇందులో ఏపీకి చెందిన రెండు ఎంపీ స్థానాల అభ్యర్థుల్ని ప్రకటించటం ఖాయమంటున్నారు.
ఇంతకూ బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలేమిటి? అన్న విషయానికి వస్తే.. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆరు స్థానాల మీద అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ధర్మవరం.. జమ్మలమడుగు, బద్వేలు.. కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరు స్థానాల్ని కేటాయించినట్లుగా చెబుతున్నారు. మరో నాలుగు స్థానాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.