ఖమ్మం విషయంలో టీడీపీతో బీజేపీ కీలక నిర్ణయం?
ఈ క్రమంలో టీడీపీకి పెద్ద పనే పెట్టేబోతోందని అంటున్నారు!
By: Tupaki Desk | 21 March 2024 4:30 PM GMTసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ బలంగా భావిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ - జనసేనలతో జతకట్టిన ఆ పార్టీ... ఆ రెండు పార్టీల సేవలను తెలంగాణలోనూ ఉపయోగించుకోవాలని చూస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో టీడీపీకి పెద్ద పనే పెట్టేబోతోందని అంటున్నారు!
అవును... గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో జతకట్టిన బీజేపీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయలేదనే చర్చ బలంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనూహ్యంగా ఏపీలోనూ బీజేపీ - జనసేనలు టీడీపీతో జతకట్టాయి. మరోపక్క గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుండానే టీడీపీ శ్రేణులు.. కాంగ్రెస్ కు సహకరించాయనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపించింది కూడా! ఈ నేపథ్యంలో.. తెలంగాణలో టీడీపీ సేవలు వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ నుంచి తేరుకుని, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని టి.బీజేపీ భావిస్తుందని అంటున్నారు. ఈ సమయంలో... 17 లోక్ సభ స్థానాల్లోనూ 10+ సీట్లు గెలుచుకునే పార్టీ సత్తా చాటినట్లే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో... కేంద్రంలో ఎంతో అవసరమైన లోక్ సభ సీట్ల విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్ స్థానాల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా బీఆరెస్స్ తరుపున బరిలోకి దిగనున్న నామా నాగశ్వరరావుపై బీజేపీ నేతల కన్ను పడిందని అంటున్నారు. వాస్తవానికి ఖమ్మంలో బీఆరెస్స్ నుంచి పోటీచేస్తున్న నామా నాగేశ్వర రావుకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు! మరోపక్క ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీ ఏనాడూ విజయం సాధించిందీ లేని పరిస్థితి. ఈ సమయంలో కాంగ్రెస్ ను నిలువరించేందుకు... పొత్తులో భాగంగా టీడీపీని ఖమ్మంలో బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తుందనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలోనే నామా నాగేశ్వర రావుని టీడీపీలోకి తీసుకుని, ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ - టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించితే గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయని.. దీంతో టీడీపీపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. పైగా ఖమ్మంలో టీడీపీ పోటీ చేస్తే... గ్రేటర్ హైదరాబాద్ లోనూ బీజేపీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలున్నాయని ఆ పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారని సమాచారం.
మరి బీజేపీ ఈ మేరకు టీడీపీపై ఒత్తిడి చేస్తుందని.. ఈ ఒత్తిడి వెనుక ఆ పార్టీ పెద్దలకు భారీ లెక్కలే ఉన్నాయంటూ వస్తున్న కథనాలు ఏ మేరకు కార్యరూపం దాలుస్తాయనేది వేచి చూడాలి.