బీజేపీపీ లో ఈ ఐదుగురే కీలకమా ?
రాబోయే ఎన్నికల్లో తెలంగాణా బీజేపీ కి సంబంధించి లోకల్ లీడర్లే కీలకపాత్ర పోషించాలి.
By: Tupaki Desk | 1 Aug 2023 7:02 AM GMTరాబోయే ఎన్నికల్లో తెలంగాణా బీజేపీ కి సంబంధించి లోకల్ లీడర్లే కీలకపాత్ర పోషించాలి. ఎందుకంటే నరేంద్రమోడీ అయినా అమిత్ షా అయినా ప్యాడింగ్ గా ఉంటారే కానీ మొత్తం వీళ్ళ భుజానే వేసుకుని ఎలక్షనీరింగ్ చేయలేరు. ఈ మధ్యనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇదే పరిస్ధితి కనబడింది.
స్థానికంగా ఉన్న నేతల ను కాదని మోడీ, అమిత్ షా లే మొత్తం ఎన్నికల ప్రక్రియను భుజాన మోశారు. దాంతో చివరకు ఏమైంది బీజేపీ ఓడిపోయింది. దాంతో ఏం తేలిందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీ, అమిత్ షానే గెలిపించలేరని.
లోకల్ లీడర్లు బలంగా ఉండి ఎలక్షనీ రింగ్ చేస్తే వాళ్ళకి మోడీ, అమిత్ మద్దతుగా నిలబడగలరు. అందుకనే తెలంగాణా లో అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల సమన్వయ కమిటి కన్వీనర్ ఈటల రాజేందర్, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక పాత్ర పోషించబోతున్నట్లు పార్టీవర్గాల టాక్. లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ బీసీ సామాజికవర్గాల కు చెందిన నేతలు. ముదిరాజ్ తరపున, మున్నూరుకాపు తరపున బండి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మున్నూరుకాపు, ముదిరాజ్ వర్గాలు మొత్తం 20 శాతం ఓటింగ్ ఉన్నట్లు అంచనా. అలాగే కిషన్ రెడ్డి, డీకే అరుణ రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు ఉపయోగపడతారని అనుకుంటున్నారు. అయితే ఇద్దరికి అంత సీనుందా అన్నదే అనుమానం. ఎందుకంటే కిషన్, డీకే ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గంలో తిరుగులేని నేతలేమీ కాదు. పైగా వీళ్ళిద్దరిపైన కుల నేతలనే ముద్రకూడా లేదు.
రెడ్డి సామాజికవర్గం నుండి చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో కూడా చాలామంది రెడ్డి నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక బీసీల్లో కూడా యాదవ్, గౌడ్ సామాజికవర్గాలు రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాల్లో బలం గా ఉన్నారు. వీళ్ళ తర్వాతే ముదిరాజ్, మున్నూరుకాపులు. కాబట్టి బీసీల్లో కూడా గౌడ్, యాదవ్ సామాజికవర్గం నేతలను కాదని ముదిరాజ్, మున్నూరుకాపులు బీజేపీ వైపు వెళతారని అనుకునేందుకు లేదు. ఏదేమైనా ఉన్నంతలో వీళ్ళయిదుగునే కీలకమని చెప్పాలి.