Begin typing your search above and press return to search.

కిషన్‌ రెడ్డికి కష్టకాలం మొదలు!

కేంద్ర కేబినెట్‌ మంత్రి కిషన్‌ రెడ్డికి కట్టబెట్టాక బీజేపీలో అంతకుముందు ఉన్నట్టువంటి ఉత్సాహం కనిపించలేదని టాక్‌ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 9:53 AM GMT
కిషన్‌ రెడ్డికి కష్టకాలం మొదలు!
X

తెలంగాణలో దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయాలతో ఇక అధికారం తమదే అనుకున్న బీజేపీకి కోదాడ ఉప ఎన్నిక గట్టి షాక్‌ ఇచ్చింది. బీజేపీ జోరుకు, దూకుడుకు కోదాడ ఉప ఎన్నికతో అడ్డుకట్ట పడింది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ను తొలగించి ఆ బాధ్యతలను కేంద్ర కేబినెట్‌ మంత్రి కిషన్‌ రెడ్డికి కట్టబెట్టాక బీజేపీలో అంతకుముందు ఉన్నట్టువంటి ఉత్సాహం కనిపించలేదని టాక్‌ నడుస్తోంది.

ఇది చాలదన్నట్టు పార్టీ సీనియర్‌ నేతలు, ద్వితీయ శ్రేణి నేతల నుంచి కిషన్‌ రెడ్డి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా అట్టే సమయం లేదు. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్‌ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్, డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు జరగడం దాదాపు ఖాయమైంది.

అయితే బీజేపీ ఎన్నికల పోరులో అప్పుడే చేతులెత్తేసిందని అంటున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి కీలక నేతలు చేరతారని అనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. బీజేపీలో ఉన్న నేతలు సైతం కాంగ్రెస్‌ లోకి పోతున్నారు. బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్, జి.వెంకటస్వామి తదితరులు కూడా పార్టీ మారిపోతారని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సమరం నుంచి తప్పుకున్నట్టుగానే చెబుతున్నారు.

ఇప్పటివరకు బీజేపీలో ఎన్నికల సన్నద్ధత లేదని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికీ 119 నియోజకవర్గాల్లో చాలా చోట్ల బీజేపీకి అభ్యర్థులు లేరని అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌ రెడ్డి.. బండి సంజయ్‌ అంతగా పార్టీని ఉత్సాహంగా, దూకుడుగా నడపలేకపోతున్నారనే అభిప్రాయాలు ఆ పార్టీలోనే వ్యక్తమవుతుండటం గమనార్హం. విమర్శలకు తగ్గట్టే కిషన్‌ రెడ్డి కూడా సాధారణ సమావేశాలు, ప్రెస్‌ మీట్లు తప్ప రాష్ట్రమంతా పర్యటించడం లేదు.

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు. రేపో మాపో ఆ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. కానీ బీజేపీలో మాత్రం ఇంతవరకు ఆలూ లేదు చూలూ లేదని అంటున్నారు.

అక్టోబర్‌ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. వీరిపైనే కిషన్‌ రెడ్డి ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.

తాజాగా హైదరాబాద్‌ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత విషయం చర్చకు వచ్చిందని అంటున్నారు. పార్టీ అధిష్టానం ఏం చేయబోతోంది? ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతున్నామని పలువురు నేతలు కిషన్‌ రెడ్డిని నిలదీసినట్టు సమాచారం.

అక్టోబర్‌ 1న మహబూబ్‌ నగర్‌ లో, 3న నిజామాబాద్‌ లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే సభలకు జన సమీకర ణ అంశం తాజా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభలకు భారీ ఎత్తున జనం హాజరయ్యేలా చూడాలని కిషన్‌ రెడ్డి నేతలను కోరినట్టు చెబుతున్నారు. అయితే తమకు పార్టీ టికెట్‌ ఇస్తారో, లేదో తెలియకుండా భారీ ఖర్చు పెట్టుకుని తాము జనసమీకరణ, తదితరాలు ఎలా చేస్తామని నేతలు కిషన్‌ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రజల్లో ఉంటూ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మనం మాత్రం ఇంకా హైదరాబాద్‌ లో మీటింగులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమిటని పలువురు నేతలు కిషన్‌ రెడ్డిని నిలదీసినట్టు తెలుస్తోంది.

మరికొందరు నేతలు ఈ అంశాన్ని ఢిల్లీ అధిష్టానం వద్దే తేల్చుకోవాలని తలపోస్తున్నారు. అక్కడ కూడా సరైన స్పందన లేకపోతే పార్టీ మారడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.