Begin typing your search above and press return to search.

బీజేపీ పెద్దలు జగన్ని టార్గెట్ చేస్తారా... ?

గతంలో చంద్రబాబు బీజేపీ పొత్తులో ఉంటూ చేసిన తప్పులను జగన్ ఇపుడు చేయడంలేదు. నిజానికి బీజేపీతో వైసీపీకి ఏ విధంగా పొత్తు లేదు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 11:30 PM GMT
బీజేపీ పెద్దలు జగన్ని టార్గెట్ చేస్తారా... ?
X

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఈ రోజున అత్యంత శక్తివంతంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సేఫ్ జోన్ లో ఉంటూ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. గతంలో చంద్రబాబు బీజేపీ పొత్తులో ఉంటూ చేసిన తప్పులను జగన్ ఇపుడు చేయడంలేదు. నిజానికి బీజేపీతో వైసీపీకి ఏ విధంగా పొత్తు లేదు. కానీ అనధికార స్నేహం అయితే కొనసాగుతూ వస్తోంది.

ఈ నేపధ్యంలో ఎవరి అవసరాలు వారివి అన్నట్లుగానే ఈ తెర వెనక బంధం సాగుతోంది అని ప్రచారంలో ఉన్న మాట. కేంద్రంలో బీజేపీకి 2024 కూడా ముఖ్యమే. గడచిన నాలుగున్నరేళ్ల పాటు వైసీపీ బీజేపీకి అన్ని విధాలుగా కీలకమైన బిల్లుల విషయంలో సాయం చేసింది.

ఇక ఎన్నికల ముందు అయినా వైసీపీకి తూచ్ కొట్టేసి బీజేపీ టీడీపీ శిబిరంలోకి వస్తుందా అంటే దాని మీద కూడా సవాలక్ష డౌట్లు ఉన్నాయి. 2024 లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోతే అపుడు సంగతేంటి ఈ ప్రశ్న ఉండనే ఉంది. దీంతోనే వైసీపీ అవసరం ఉందని కమలనాధులు గ్రహించి దానికి అనుగుణంగానే తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో వన్ సైడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే బీజేపీకి ఈ రోజున లేదు అని అంటున్నారు.

అందుకే వచ్చే ఎన్నికల్లో వీలైనంతవరకూ న్యూట్రల్ విధానం అమలు చేస్తారని అంటున్నారు. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా ఏపీ రాజకీయాలను బీజేపీ పెద్దలకు వివరించే ప్రయత్నం ఆమె తాజా ఢిల్లీ టూర్ లో చేశారని అంటున్నారు. అమిత్ షాతో భేటీలో వర్తమాన రాజకీయాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

అయితే ఏపీలో ఏమి జరుగుతోంది అన్నది బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలియకుండా ఉండదు అనుకుటే పొరపాటే అని అంటున్నారు. వారికి అన్నీ తెలుసు. అందువల్ల వారి వ్యూహాలు వారికి ఉంటాయని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ ప్రభుత్వం మీద సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా వైసీపీతో బీజేపీకి ఎలాంటి తెర వెనక సంబంధాలు లేవు అని చెప్పడానికి పురంధేశ్వరి డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా వైసీపీ చెప్పుకున్నట్లుగా కేంద్రంలోని బీజేపీ మద్దతు ఆ పార్టీకి ఏ కోశానా లేదని చాటి చెప్పడమే ఆమె ఉద్దేశ్యం అంటున్నారు.

దాంతో పాటు ఒకసారి వైసీపీకి బీజేపీ దూరం అయితే ఆటోమేటిక్ గా టీడీపీ వైపే మొగ్గు చూపుతుందని కూడా ఇందులో లోతైన అవగాహన కూడా ఉంది అని అంటున్నారు. అయితే వైసీపీతో పేచీ పెట్టుకోవడానికి కేంద్ర బీజేపీ పెద్దలు ఎంతవరకూ సుముఖంగా ఉంటారు అన్నదే ఇక్కడ పాయింట్. తెలంగాణాలో బీయారెస్ అవినీతి కుటుంబ పార్టీ అని చెబుతున్నా ఈ రోజుకీ అక్కడ విచారణకు కేంద్ర ఏజెన్సీ దిగలేదు. పైగా కేసీయార్ మోడీ ప్రభుత్వం మీద ఎన్నో సార్లు ఘాటైన విమర్శలు చేశారు.

అయినా సరే అక్కడే సీబీఐ ఊసు లేదని, మరి ఏపీలో వైసీపీ ఒక్క మాట పల్లెత్తి కేంద్ర బీజేపీ పెద్దలను అనని చోట ఎందుకు సీబీఐ విచారణ ఉంటుందని కూడా అంటున్న వారూ ఉన్నారు. ఇది పక్కా పొలిటికల్ గేమ్. ఇందులో ఎవరి ఆలోచనలు వారివి. అందువల్ల అటు కేంద్ర పెద్దలు తమ పావులు తాము కదుపుతారు. వైసీపీ కూడా తనదైన పరిధిలో చేయాల్సింది చేస్తుంది. ఇక ఏపీ బీజేపీ పాత్ర ఇందులో ఏంటి అంటే వారు ఏపీలో పార్టీగా ఇలాంటి డిమాండ్లు చేస్తూనే ఉంటారని అంటున్నారు.

ఆ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అడ్డు చెప్పేది ఉండదు, మీ పని మీరు చేసుకోండి అనే అంటున్నారు. కానీ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఏపీ మీద ప్రయోగించేటంత సీరియస్ పాలిటిక్స్ అయితే ఇపుడు జరుగుతాయని ఎవరూ అనుకోవడంలేదు అంటున్నారు. ఏపీ బీజేపీని ఏ మాత్రం పటిష్టం చేయకుండా అయిదేళ్ళ పాటు గడిపేసి ఎన్నికల వేళకు టీడీపీతో పొత్తులు అంటూ నివేదికలు ఇవ్వడమే ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న విషయం అన్నది కూడా ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి తెలుసు అంటున్నారు.

విలువైన సమయంలో పార్టీని సొంతంగా బాగు చేసుకోకుండా దశాబ్దాల పాటు ఎవరో ఒకరి భుజాల మీద ఎక్కాలని చూడడం నిజంగా రాజకీయ విషాదమే. ఈశాన్య రాష్ట్రాలలో సైతం బీజేపీ కమలం వికసించింది. ఏపీలో ఎందుకు అలా జరగదు, అంటే దానికి ఏపీ నాయకత్వం లోపమే ఎక్కువగా ఉందని అంతా అంటారు. నేల విడిచి సాము చేయడం పొత్తులలో తమ సీటు పదిలం చేసుకోవడం అన్న షార్ట్ కట్ మెదడ్ ని విడిచిపెట్టిన నాడే ఏపీ బీజేపీ వికసిస్తుంది అని కూడా అంటున్నారు.