బీజేపీ ని పల్లెత్తు మాట అనని జగన్...!
ఇక జగన్ గత సిద్ధం సభలతో పోలిస్తే పూర్తి ధీమాతో కనిపించారు.
By: Tupaki Desk | 11 March 2024 3:49 AM GMTచివరాఖరున జరిగిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. లక్షలాది మంది జనాలు తరలి వచ్చారు. ఎన్నికలు దాదాపుగా నెల రోజుల వ్యవధిలోకి వచ్చాక జరిగిన ఈ సభ వైసీపీకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇక జగన్ గత సిద్ధం సభలతో పోలిస్తే పూర్తి ధీమాతో కనిపించారు.
ఆయన స్పీచ్ కూడా ఏకంగా గంటా పది నిముషాల పాటు సాగింది. అందులో ఆయన ఎక్కువ భాగం చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు. బీజేపీ కొత్తగా కూటమిలో చేరింది. ఆ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది.
బీజేపీ చేరికతో ఎన్నో మార్పులు రాజకీయంగా వస్తాయని అంతా అంచనా కడుతున్న వేళ జగన్ మాత్రం బీజేపీని పూర్తిగా పక్కన పెట్టేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీతో చంద్రబాబు పొత్తు అని బాబుని ఎద్దేవా చేశారు తప్ప బీజేపీని ఏమీ అనలేదు.
ఇక ఆయన తన చెల్లెలు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పేరుని కూడా ఎత్తేందుకు ఇష్టపడలేదు. షర్మిల ఊసు అసలే లేదు. కానీ చంద్రబాబు జేబులో మరో పార్టీ ఉంది అని చెప్పడం ద్వారా ఆయన డబుల్ స్టాండర్డ్ విధానాలు బీజేపీ పెద్దలకు తెలిసేలా చేయగలిగారు అని అంటున్నారు.
ఇక ఆయన చంద్రబాబునే ముందు పెట్టి తమ మాటల తూటాలు పేల్చారు. బాబు ఫెయిల్యూర్స్ అన్నీ ఏకరువు పెట్టారు. బాబుకు మరోసారి అధికారం ఇస్తే కనుక నష్టపోయేది పేదలే సుమా అని హెచ్చరించారు. నరక లోకానికి పర్యాయ పదం నారా లోకం అని జనసామాన్యానికి అర్ధం అయ్యేలా బాబు ఏలుబడి ఏంటో ఒక్క పదంలో చెప్పేశారు.
ఇదిలా ఉంటే జగన్ ఎందుకు బీజేపీ గురించి మాట్లాడలేదు అన్నది అందరికీ కలిగే సందేహం. నిజానికి బీజేపీ పొత్తులోకి వచ్చి ఇరవై నాలుగు గంటల లోపే జరిగిన వైసీపీ అతి పెద్ద సభ ఇది. కానీ జగన్ మాత్రం చాలా వ్యూహాత్మకంగానే వ్యహరించారు అని అంటున్నారు.
బీజేపీని ఎందుకు అనలేదు అంటే అవసరం లేదు అని అంటున్నారు. ఏపీలో బీజేపీ పెద్దగా లేదు. ఆ పార్టీని అనడం కూడా పెద్దగా ఉపయోగపడదు అని భావించే ఇలా చేశారు అని అంటున్నారు. ఇక బీజేపీని పక్కన పెట్టి బాబుని అనడం ద్వారా తన ప్రత్యర్ధి ఆయనే అని మళ్లీ తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ పాత్రను పూర్తిగా ప్యాకేజి స్టార్ గానే పోల్చారు.
ఆయన త్యాగాలకు హద్దులు లేవని ఆఖరుకు తాను తాగే టీ కప్పుని బాబుకి ఇమ్మన్నా ఇస్తాడని ఎద్దేవా చేశారు. అలా బాబు చేతిలో కీలు బొమ్మగా మారిన పవన్ గురించి ఆశ పెట్టుకోవడం దండుగ అన్నది ఆయన వెనక ఉన్న అభిమానులకు కానీ ఒక బలమైన సామాజిక వర్గానికి కానీ జగన్ సందేశం ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు.
తనకు ఒడిపోతాను అన్న భయం ఏ కోశానా లేదని అంతే కాదు తాను గెలిచి తీరుతాను అన్న ధీమాను నాలుగో సిద్ధం సభతో జగన్ కలుగజేశారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉంటుందో వైసీపీ టార్గెట్ ఏంటి అన్నది ఈ సభ ద్వారా చెప్పేశారు. బీజేపీని పక్కన పెట్టడం వల్ల అనేక ఇతర రాజకీయ వ్యూహాలు కూడా అంటున్నారు.