నాలుగు వందల సీట్లు... బీజేపీ మరచిపోతోందా ?
అప్పట్లో ఇందిరాగాంధీ దారుణ హత్య తరువాత జరిగిన ఎన్నికల్లో వెల్లువలా వచ్చిన సానుభూతి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 406 దాకా ఎంపీ సీట్లను కట్టబెట్టింది.
By: Tupaki Desk | 23 May 2024 12:30 AM GMTబీజేపీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా ప్రారంభించింది. ఆ సమయంలో బీజేపీ చెప్పినది ఏంటి అంటే నాలుగు వందల సీట్లు మా ఖాతాలోనే అని. దాని మీద రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో ఆ అద్భుతం ఒకే ఒకసారి జరిగింది అది కూడా 1984లో రాజీవ్ గాంధీకే జరిగింది. అప్పట్లో ఇందిరాగాంధీ దారుణ హత్య తరువాత జరిగిన ఎన్నికల్లో వెల్లువలా వచ్చిన సానుభూతి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 406 దాకా ఎంపీ సీట్లను కట్టబెట్టింది.
మళ్ళీ దేశంలో ఆ మ్యాజిక్ చోటు చేసుకోలేదు. అంతవరకూ ఎందుకు ఏ ఒక్క పార్టీ 2014 దాకా పూర్తి మెజారిటీని కూడా సాధించలేదు. 2014, 2019లలో మాత్రం బీజేపీ సొంతంగా ఫుల్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. మరో వైపు చూస్తే ఏ ఒక్క పార్టీ సొంతంగా 325 కూడా సాధించలేదు.
కానీ బీజేపీ మాత్రం తనకు సొంతంగా 370 సీట్లు అని భారీ టార్గెట్ పెట్టుకుంది. ఎన్డీయే కూటమికి 400 సీట్లు అని కూడా మరో టార్గెట్ ని పెట్టుకుంది. ఈ రెండూ సాధ్యమే అని ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచి ఆర్భాటంగా ప్రచారం చేస్తూ వచ్చింది. అయిఎత వరసగా పోలింగ్ మొదలైన తరువాత విడతల వారీగా జరిగిన తీరు పోలింగ్ సరళిని చూసిన మీదట బీజేపీ నేతలు నాలుగు వందల సీట్లు అనడం మెల్లగా తగ్గించేశారు అని అంటున్నారు.
ఇక బీజేపీ ఇంటర్నల్ డిస్కషన్స్ లో కూడా ఈసారి గెలిస్తే చాలు అన్న చర్చ కూడా సాగుతోంది అని అంటున్నారు. అంటే బొటా బొటీ నంబర్ తో అయినా బయటపడితే మేలు అని అనుకుంటున్నారని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. వారు అన్నారని కాదు కానీ మొదటి మూడు విడతల పోలింగ్ పూర్తి అయిన తరువాత చూస్తే బీజేపీ పెద్దల నుంచి నాలుగు వందల సీట్లు అన్న నంబర్ మాత్రం పెద్దగా వినిపించడలేదు అని అంటున్నారు. అంటే సౌండ్ తగ్గింది అని అంటున్నారు.
మరో వైపు మొదటి రెండు విడతల పోలింగ్ వరకూ సైలెంట్ గా ఉన్న ఇండియా కూటమి ఆ తరువాత గొంతు సవరించుకుంది. మేమే గెలుస్తున్నామని చెప్పేంతగా ఇపుడు బిగ్ సౌండ్ చేస్తోంది. ఈ పరిణామాల మీద మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బీజేపీ మరచిపోయిన నంబర్ 400 అని సెటైర్లు పేల్చారు.
మొదట్లో బిగ్గరగా ఇదే నంబర్ తో హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇపుడు ఎందుకు దాన్ని ప్రస్తావించడం లేదు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆయన తాజాగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు ఎదురు లేదు, తిరుగు లేదు అని చెప్పిన బీజేపీ 400 స్ధానాలకు పైగా గెలుస్తామని ప్రారంభంలో చెప్పినట్లుగా గుర్తు అని ఎద్దేవా చేశారు.
అయితే ఇపుడు మాత్రం బీజేపీ నేతలు అసలు ఆ సంఖ్య గురించే చెప్పడం లేదన్నారు. అలా ఎందుకు చేస్తున్నారో వారే చెప్పాలని ఆయన అన్నారు. ఇక మోడీ పాలనలో నంబర్లు చాలా పెద్దవిగా ఉన్నవి చెప్పాలంటే పెట్రోల్ ధరలు రూ.100 దాటాయని ఆయన మండిపడ్డారు. ఇలా చాలా పెద్ద నంబర్లు ధరల పెరుగుదలలో ఎన్నో ఉన్నాయని విమర్శించారు.
సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీక్‌ల ఘటనల వంటి వాస్తవ అంశాలను బీజేపీ మరుగునపడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలా తన పాలనలో ఎన్నో వైఫల్యాలు మూటకట్టుకున్న బీజేపీ 400 సీట్లు ఎలా ఆశిస్తోంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు.