రాములమ్మ అసంతృప్తికి కారణమిదేనా ?
బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన విజయశాంతి అలియాస్ రాములమ్మ అసంతృప్తికి కారణం ఏమిటో తెలిసింది.
By: Tupaki Desk | 8 Oct 2023 11:30 AM GMTబీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన విజయశాంతి అలియాస్ రాములమ్మ అసంతృప్తికి కారణం ఏమిటో తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ఆమె మల్కాజ్ గిరి పార్లమెంటు నుండి పోటీచేయాలని ఫిక్సయ్యారట. అయితే ఈ విషయమై కేంద్రంలోని పెద్దలు ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదట. ఇదే విషయాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన భేటీలో రాములమ్మ ప్రస్తావించారట. తనకు మల్కాజ్ గిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారట.
అయితే వీళ్ళ భేటీలో నడ్డా ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. కారణం ఏమిటంటే మరో సీనియర్ నేత, జాతీయస్ధాయి నేతలతో బాగా సన్నిహితంగా ఉండే మరళీధర్ రావు కూడా మల్కాజ్ గిరి లోక్ సభకు పోటీ చేయాలని అనుకుంటున్నారట. రాములమ్మతో పోల్చితే మురళీయే పార్టీ పరంగా పవర్ ఫుల్లని చెప్పాలి. కాకపోతే మురళీకి గ్రౌండ్ లెవల్లో బేస్ లేదు. మురళీ మామూలు జనాలకు పెద్దగా పరిచయంలేని వ్యక్తి. పార్టీలో చాలాకాలంగానే ఉన్నా ఎప్పుడూ తెరవెనుకకు మాత్రమే పరిమితమై ఉండేవారు.
మురళీతో పోల్చితే రాములమ్మ చాలా పాపులర్ అనే చెప్పాలి. రాములమ్మ జనాలను కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరంలేదు. అయితే ఈమెకు కూడా క్షేత్రస్ధాయిలో పట్టులేదు. ఎందుకంటే పార్టీ తరపున ఏరోజూ సొంతంగా కార్యక్రమాలను నిర్వహించిందిలేదు. ఎంపీగా పోటీచేయాలని అనుకోవటమే కాని అందుకు తగ్గట్లుగా బేస్ ప్రిపేర్ చేసుకున్నది లేదు. ఎంపీగా పోటీచేయాలని అనుకుంటే 24 గంటలూ, 365 రోజులూ జనాల్లోనే తిరుగుతుండాలి. పార్టీ జనాలతో పాటు మామూలు జనాల్లో కూడా పట్టుసాధించుకోవాలి.
అప్పుడే జనాలు గుర్తిస్తారు. కానీ రాములమ్మ పార్టీ కార్యక్రమాల్లోనే పెద్దగా పాల్గొనదు. ఎప్పుడు చూసినా తనకు పార్టీలో తగిన ప్రాదాన్యత దక్కటంలేదనే అలకతోనే సరిపోతోంది కాలమంతా. పార్టీ వర్గాల ప్రకారం ఎవరికి టికెట్ ఇచ్చినా వృధానేట. ఏదేమైనా ఈ ఇద్దరైతే అలాగ అనుకోరు కదా. తాము నామినేషన్ వేయటమే ఆలస్యం గెలిచిపోవటమే అని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.