లక్షలాది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఓట్లు కొల్లగొట్టే బ్రహ్మాస్త్రం
ఎన్నికల వేళ తాయిలాలు ఇవ్వడం ప్రభుత్వాలకు అలవాటే. అధికారంలో ఉంటూ తీసుకునే నిర్ణయం కాబట్టి దాని ద్వారా భారీఎత్తున లబ్ధి చేకూరుతుంది
By: Tupaki Desk | 11 April 2024 10:57 AM GMTఎన్నికల వేళ తాయిలాలు ఇవ్వడం ప్రభుత్వాలకు అలవాటే. అధికారంలో ఉంటూ తీసుకునే నిర్ణయం కాబట్టి దాని ద్వారా భారీఎత్తున లబ్ధి చేకూరుతుంది. వివిధ వర్గాలకు చేరువయ్యేలా తీసుకునే ఇలాంటి నిర్ణయాలు అన్నిసార్లూ సత్ఫలితాలు ఇస్తాయని చెప్పలేం కానీ, అప్పటికే ఉన్న వ్యతిరేకతను కొంతైనా తగ్గిస్తాయని మాత్రం చెప్పొచ్చు. ఈ కోవలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టార్గెట్ 400 ప్లస్ అంటూ ప్రయత్నాలు సాగుస్తున్న మోదీ సర్కారు ఈసారి ఏకంగా లక్షలాది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులపై గురిపెట్టింది. వారిని అమాంతం మెప్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
పెన్నిధి.. భవిష్య నిధి..
ప్రతి ఉద్యోగి తన జీతంలోంచి కొంత సేవింగ్స్ కు తీస్తుంటారు. ఇది వచ్చే జీతం మీద, వారి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాకాకుండా నేరుగా జీతంలోనే భాగంగా ఉంటుంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్). ఎంప్లాయర్, ఎంప్లాయీ వాటాగా నెలనెల కొంత ఈపీఎఫ్ కు వెళ్తుంటుంది. పిల్లల చదువు, ఉద్యోగం, వివాహం, ఇంటి నిర్మాణం తదితరాలకు ఉద్యోగులు ఈ మొత్తాన్ని విత్ డ్రా చేస్తుంటారు. ఆయా అవసరాలకు తగ్గట్లుగా గరిష్ఠంగా 80 శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
15 శాతం నుంచి 21 శాతానికి..
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) కింద ప్రస్తుతం గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. అయితే, పదేళ్లుగా ఇందులో మార్పు లేదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏకంగా రూ.21 వేలకు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ వో) సంస్థ.. ఈపీఎఫ్ వ్యవహారాలు చూస్తుంది. గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని చాలాకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కానీ, స్పందన లేదు.
ఎన్నికల ముంగిట..
త్వరలో కీలకమైన ఎన్నికలు ఉన్నందున ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ వో)పై ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, గరిష్ఠ వేతన పరిమితి 2014కు ముందు వరకు రూ.6,500గా ఉంది. అయితే, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఇప్పటికే వేతన పరిమితిని రూ.21 వేలు చేసింది. దీంతో ఈపీఎఫ్ ను కూడా ఆ మొత్తానికి చేర్చాలని కేంద్రం ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా భారం పడుతుంది. అయితే, పీఎఫ్ ఖాతాకు జమ అయ్యే మొత్తం పెరగడం ద్వారా ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది.
ఇదీ భవిష్య నిధి లెక్క..
భవిష్య నిధి (పీఎఫ్)లో ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి సంబంధిత భాగం ఈపీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. యజమాని వాటాలో మాత్రం 8.33 శాతం పింఛను పథకంలో.. మిగతాది ఈపీఎఫ్ ఖాతాకు చేరుతుంది. వేతన పరిమితి పెంచితే తదనుగుణంగా ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. ఈపీఎఫ్‌వో, ఈపీఎస్ ఖాతాలో చేరే మొత్తం పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి పీఎఫ్ మొత్తం పెరుగుతుంది.
కొసమెరుపు: ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం కొత్త ప్రభుత్వంలోనే వెలువడనుంది. అయితే, దీని ప్రభావం పరోక్షంగా ఉద్యోగులపై ఉంటుందనడంలో సందేహం లేదు.