రాములోరి అయోధ్యలోనే కాదు సీతమ్మ ఊళ్లోనూ బీజేపీ ఓటమి
ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 8 Jun 2024 5:15 AM GMTరాముడి పేరు మీద బీజేపీ సాగించిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయోధ్యలో తాము నిర్మించిన రామ మందిరాన్ని చూపించి ఓట్లు అడిగిన వైనంపై దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని ప్రజల రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ.. అయోధ్యలో మాత్రం బీజేపీని రిజెక్టు చేశారు అక్కడి ప్రజలు. అయోధ్య రామాలయం కొలువు ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించటం తెలిసిందే. ఈ అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇప్పటివరకు రాములోరు కొలువై ఉన్న అయోధ్యలో బీజేపీ ఓటమిపాలు కావటంపై వార్తలు వచ్చాయి. కానీ.. సీతమ్మ ఊరుగా చెప్పే సీతాపూర్ లోనూ బీజేపీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. కమలం పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలు కావటం సంచలనంగా మారింది. బీజేపీ అభ్యర్థి రాజేశ్ వర్మను కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ రాథోడ్ 89,641 ఓట్ల తేడాతో ఓడించారు.
ఈ స్థానంలో బీజేపీ ఓటమిని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే భావించారు. అలాంటిది అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ నియోజకవర్గంమీద పడేలా చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీతాపూర్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సమాజ్ వాదీ పార్టీకి దక్కింది. ఆ పార్టీ సీనియర్ నేత నరేందర్ వర్మను ఇక్కడ బరిలో నుంచి దింపాలని భావించారు.
కమలనాథులకు కంచుకోట లాంటి సీతాపూర్ స్థానం టికెట్ తనకు వద్దన్న ఆయన మాటతో కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దించాల్సి వచ్చింది. తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి నకుల్ దూబేకు టికెట్ ఇచ్చేందుకు ఆఫర్ చేసింది. ఆయన అందుకు ఆసక్తి చూపలేదు. దీంతో.. అభ్యర్థులు ఎవరూ దొరకని వేళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీకి చెందిన తేలీ సామాజిక వర్గానికి చెందిన రాజేశ్ రాథోడ్ కు టికెట్ కేటాయించారు. ఆయన నామినేషన్ తర్వాత పరిస్థితుల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దళితులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు మళ్లటంతో సీతమ్మ వారి ఊళ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఓవైపు రాములోరి ఊళ్లోనే కాదు.. ఆయన సతీమణి సీతమ్మ ఊళ్లోనూ బీజేపీ ఓడటం దేనికి సంకేతం? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.