తెలంగాణ ఎలక్షన్స్.. మీడియా మేనేజ్‌మెంట్ కోసం బీజేపీ దూకుడు!
రాష్ట్రంలో మీడియా వ్యవహారం, అనుకూల, ప్రతికూల మీడియా సంస్థల విషయంపై ఆరా తీసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
By: Tupaki Desk | 11 Oct 2023 2:30 PM GMTఎక్కడ ఎన్నికలు ఉన్నా.. అక్కడ మీడియాను మేనేజ్ చేయడం అనేది బీజేపీ నాయకులు ఇటీవల కాలంలో తమ వంతు విధిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్ని కల సమయంలో సుమారు 750 కోట్ల రూపాయలను అక్కడ మీడియా మేనేజ్‌మెంట్ కోసం వినియోగించారనే ఒక అనధికార లెక్క అప్పట్లో హల్చల్ చేసింది. తమకు అనుకూలంగా ఉన్న మీడియాను ప్రోత్సహించేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను కట్టడి చేసేందుకు బీజేపీ నాయకులు ఎంతో కృషి చేశారనే విమర్శలు వచ్చాయి.
ఇక, ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహాలో బీజేపీ మీడియా మేనేజ్‌మెంట్ కోసం పావులు కదుపుతున్న ట్టు సమాచారం. తాజాగా తెలంగాణలో పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా.. రాష్ట్రంలో మీడియా వ్యవహారం, అనుకూల, ప్రతికూల మీడియా సంస్థల విషయంపై ఆరా తీసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న బీజేపీ.. మీడియాను తనవైపు తిప్పుకోవడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలనే వ్యూహంతో ఉందనే విషయం స్పష్ట మవుతోంది.
అయితే, కర్ణాటకలో మీడియాను ఎంత మేనేజ్ చేసినప్పటికీ.. అక్కడి ప్రజలు ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితులు, ఇక్కడి మీడియాపై అమిత్ షా స్థానిక నేతలతో చర్చించినట్టు తెలిసింది. వాస్తవానికి ఇప్పుడున్న ప్రధాన మీడియాలో ఓ వర్గం బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. బీజేపీ వ్యతిరేక వార్తలు రాసేందుకు, లేదా ప్రచారం చేసేందుకు కూడా ఈ మీడియా సాహసించడం లేదనే వాదన ఉంది.
ఇక, ఇప్పుడు ఎన్నికల నోటిఫణికేషన్ కూడా ప్రకటించిన దరిమిలా.. తమకు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దన్నుగా ఉన్న మీడియాను మరింతగా తమకు అనుకూలంగా వ్యవహరించేలా వ్యూహాత్మకంగా పావులు కదిపే అంశంపై బీజేపీ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికలపై మీడియాను తమకు అనుకూలంగా మేనేజ్ చేయగలిగితే ఇది తమకు ఎన్నికల్లో ఎంతో కొంత అనుకూలంగా మారుతుందనే ఆలోచన కూడా ఉంది. మొత్తానికి బీజేపీ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.