Begin typing your search above and press return to search.

మంత్రి కోసం బీజేపీ ఎమ్మెల్యే ఫోకస్ ?

చంద్రబాబు కేబినెట్ లో ఖాళీగా ఉంచిన ఒకే ఒక మంత్రి పదవి కోసం టీడీపీలోనే గట్టి పోటీ ఉంది.

By:  Tupaki Desk   |   17 July 2024 9:30 AM GMT
మంత్రి కోసం  బీజేపీ ఎమ్మెల్యే  ఫోకస్ ?
X

చంద్రబాబు కేబినెట్ లో ఖాళీగా ఉంచిన ఒకే ఒక మంత్రి పదవి కోసం టీడీపీలోనే గట్టి పోటీ ఉంది. అయితే మిత్ర పక్షం అయిన జనసేన బీజేపీ ఆశలు కూడా తక్కువ కాకుండానే ఉన్నాయి. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. బీజేపీకి ఒకే ఒక బెర్త్ ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు చక్కగానే వ్యవహరించారు అని అంటున్నారు. ప్రతీ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అని నిష్పత్తిని పెట్టుకుని మరీ అలా పదవుల పంపిణీ చేశారు. 21 మంది ఉన్న జనసేనకు మూడు దక్కాయి.

ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఒక్కటి దక్కడమూ న్యాయమే అని అంటున్నారు. ఇక టీడీపీకి 135 మంది ఉన్నారు. ఆ లెక్కన 20 మంది మంత్రులు దక్కడమూ పూర్తి సబబు అని అంటున్నారు. ఇక అందరికీ పంచాక ఒక మంత్రి పదవికి లెక్క సరిపోలేదు.

ఇది బాబు మార్క్ అర్ధమెటిక్స్ కాదు పొలిటికల్ మేథమేటిక్స్ లోనూ సమీకరణలు కుదరకే అలా ఉంచేశారు అని అంటున్నారు. బాబు మంత్రివర్గంలో క్షత్రియులకు ప్రాతినిధ్యం లేదు. వారు ఆరేడుగురు గెలిచి ఉన్నారు. అయినా చాన్స్ ఇవ్వలేదు. దాంతో ఆ సామాజిక వర్గం కొంత అసంతృప్తిగా ఉంది.

టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ క్రిష్ణం రాజు అయితే మంత్రి పదవి మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇక బీజేపీ నుంచి విశాఖ ఉత్తరానికి చెందిన విష్ణు కుమార్ రాజు కూడా ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తనకు అవకాశం ఉంటుందని భావించినా దక్కలేదు.

దాంతో ఆయన కొత్త రూట్ లోకి వచ్చారు. చంద్రబాబుని టీడీపీ వారి కంటే ఎక్కువగా ఆయనే తలుస్తున్నారు. అపుడెపుడో విశాఖ వచ్చిన చంద్రబాబుని గో బ్యాక్ అంటూ విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేతలు చెప్పులు విసిరి అవమానించారని రాజు గారు మండిపోతున్నారు. వారికి శిక్షలు పడాల్సిందే అని ఆయన ఆవేశం ప్రదర్శిస్తున్నారు.

అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను ఈ విషయంలో అసలు ఊరుకోను అని హెచ్చరిస్తున్నారు. ఆయన బీజేపీకి చెందిన వారు అయినప్పటికీ బాబుకు అవమానం తన అవమానంగా తీసుకుని ఆయన ఇంతలా ఫైర్ కావడమే చర్చనీయాంశంగా ఉంది. విశాఖ నిండా టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీ సహా కీలక నేతలు ఉన్నారు. అలాంటిది వారు చూసుకోరా అన్న చర్చ ఉంది. అంతదాకా ఎందుకు హోం మంత్రి అనిత విశాఖకు చెందిన వారే అని గుర్తు చేస్తున్నారు.

అయితే విష్ణు కుమార్ రాజు ఈ విధంగా మాట్లాడటం ద్వారా బాబు దృష్టిలో పడితే మంత్రి పదవి దక్కుతుంద భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అలా మినిస్టర్ కుర్చీకే ఆయన టార్గెట్ చేస్తున్నారా అని సొంత పార్టీతో పాటు టీడీపీలోనూ డిస్కషన్ సాగుతోంది అని అంటున్నారు.

విష్ణు కుమార్ రాజు ఇపుడే కాదు గతంలో బీజేపీ పక్ష నేతగా ఉన్నపుడు కూడా బాబుని తెగ పొగిడేవారు. ఆయన బీజేపీ లో ఉంటూ బాబుని మెచ్చుకునే నేతగా సొంత పార్టీలో విమర్శలు ఎదుర్కొన్నా తన పంథాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇపుడు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే బాబు చల్లని చూపు కోసమే అని అంటున్నారు. క్షత్రియుల కోటా ఎటూ భర్తీ చేయాలనుకుంటే మిత్ర పక్షం బీజేపీకి రెండవ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే విశాఖ సిటీలో మినిస్టర్ ఖాళీని భర్తీ చేయాలని అనుకుంటే విష్ణు కుమార్ రాజు తప్ప మరో ఆప్షన్ లేదు అని అంటున్నారు. మరి రాజు గారి లక్ ఎలా ఉందో అని అంటున్నారు.