రాజాసింగ్ గుర్రు.. 'అక్క' మాధవిలత క్లారిటీ
తాజాగా ఢిల్లీలో ఆమె పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు
By: Tupaki Desk | 4 March 2024 6:10 AM GMTతన మాటలతో గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్ చానళ్లలోనూ ఆసక్తికరంగా మారిన మాధవీలతను రానున్న ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేయటం తెలిసిందే. విరంచి ఆసుపత్రి ఎండీగా వ్యవహరిస్తున్న ఆమె అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయటం ఒక ఎత్తు అయితే.. అభ్యర్థిగా ప్రకటించిన నాటికి ఆమె బీజేపీలో చేరి ఉండకపోవటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.
తాజాగా ఢిల్లీలో ఆమె పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. మాధవీలత పేరును బీజేపీ అధినాయకత్వం ప్రకటించటంపై రాజాసింగ్ కినుకుతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో ఇంతమంది ఉంటే.. వారెవరినీ కాదని.. ఎక్కడి నుంచో మరో వ్యక్తిని తీసుకురావటం ఏమిటన్నది ఆయన మాటగా చెబుతున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు సంచలనంగా మారింది. ‘‘హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు మొగోడే దొరకలేదా?’’ అంటూ ఆయన వ్యాఖ్య పెను సంచలనంగా మారింది. అయితే.. ఈ వ్యాఖ్యపై ఆయన రియాక్టు కావాలని కోరుతూ పలువురు మీడియా ప్రతినిధులు ఆయన్ను సంప్రదించే ప్రయత్నం చేసినా.. అందుబాటులోకి రాలేదు.
తాజా ఎంపీ ఎన్నికల్లో రాజాసింగ్ టికెట్ ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదేమీ జరగకపోవటంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం మాధవీలత స్పందించారు. సోషల్ మీడియాలో రాజాసింగ్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై ఆమె ఢిల్లీలో స్పందించారు. తమదో కుటుంబమని.. ఫ్యామిలీలో అక్కా చెల్లెళ్లు.. అన్నాతమ్ముళ్ల మధ్య మాటలు జరుగుతుంటాయని.. అవన్నీ సర్దుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తమ్ముడు అక్కను ఏమైనా అంటే తప్పు పట్టొచ్చా? అని ప్రశ్నించిన ఆమె తీరు ఆసక్తికరంగా మారింది. పార్టీలోకి ఎంట్రీ ఇస్తూనే ఆమె తన తీరును ప్రదర్శించారని.. మరి తమ్ముడు రాజాసింగ్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఆమె పోటీ చేస్తున్న హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కూడా ఉందన్నది మర్చిపోకూడదు.