బీజేపీ ఎంపీ అభ్యర్థుల విజయవకాశాలపై విశ్లేషణ!
పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీకి చాలా మంది ఊహించని విధంగా ఆరు లోక్ సభ స్థానాలు దక్కాయి! అంటే... సుమారు 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ప్రభావం కనిపించబోతోందన్నమాట
By: Tupaki Desk | 26 March 2024 7:27 AM GMTపొత్తులో భాగంగా ఏపీలో బీజేపీకి చాలా మంది ఊహించని విధంగా ఆరు లోక్ సభ స్థానాలు దక్కాయి! అంటే... సుమారు 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ప్రభావం కనిపించబోతోందన్నమాట. ఈ క్రమంలో తాజాగా ఆ ఆరు స్థానాల్లోనూ అభ్యర్థులను కన్ ఫాం చేసింది అధిష్టాణం. ఈ నేపథ్యంలో... ఆ ఆరు స్థానాల్లోనూ స్థానిక పరిస్థితులు, వీరి విజయవకాశాలపై వాటి ప్రభావం మొదలైన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అరకు - కొత్తపల్లి గీత!:
వాస్తవానికి కొత్తపల్లి గీతకు ఎస్టీ సామాజికవర్గం ఎప్పుడో దూరం పెట్టేసిందని చెబుతుంటారు. ప్రధానంగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన అనంతరం ఆమె టీడీపీకి జై కొట్టడం, పైగా ఆమె సామాజికవర్గంపై కూడా సందేహాలు తెరపైకి రావడం ఇందుకు కారణంగా తెలుస్తుంది! ఇక్కడ వైసీపీ నుంచి ఎస్టీ వాల్మీకి సామాజికవర్గానికి చేందిన చెట్టి తనూజ రాణికి జగన్ టిక్కెట్ కేటాయించారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మెజార్టీ 2,24,089 కావడం గమనార్హం!
రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా తెలుగువారికి గుర్తిండిపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలోనే నివాసం ఉంటున్నారని అంటున్నారు. అయినప్పటికీ ఈయనకు ఏపీలో టిక్కెట్ దక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఈయన రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఈయన ప్రత్యర్థి వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి కావడంతో ఫైట్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది!
అనకాపల్లి - సీఎం రమేష్:
2020లో టీడీపీ నుంచి బీజేపీలో చేరి రాజ్యసభ ఎంపీగా పదవి పొందిన సీఎం రమేష్ సొంత జిల్లా కడప. కాగా... ఆయన కడప నుంచి వచ్చి తాజాగా అనకాపల్లి లోక్ సభ టిక్కెట్ సంపాదించుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అనకాపల్లిలో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ కంటే స్థానికతకే ఓటర్లు పట్టం కడతారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరి ఈసారి అనకాపల్లి ప్రజానికం ఆలోచన ఎలా ఉందనేది వేచి చూడాలి!
తిరుపతి - వరప్రసాద్:
ఈ టిక్కెట్ ప్రస్తుతం బీజేపీతో పాటు కూటమిలోనూ ఆసక్తిగా మారింది. నిన్నటివరకూ వైసీపీలో ఉన్న గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరి.. అనూహ్యంగా తిరుపతి టిక్కెట్ దక్కించుకున్నారు. అసలు ఇంతకాలం బీజేపీ నేతలతో ఎలాంటి పరిచయం ఉన్నట్లు కనిపించని ఆయన అనూహ్యంగా ఈ టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం.
ఈయన 2014లో తిరుపతి ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి 37,425 ఓట్లతో గెలిచారు. ఇక 2019లో ఇక్కడ వైసీపీకి 2,28,376 ఓట్ల మెజారిటీ దక్కింది.
రాజమండ్రి - పురందేశ్వరి:
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఈదఫా రాజమండ్రి ఎంపీగా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు... మొత్తం 12,39,921 ఓట్లకు గానూ కేవలం 33,892 (2.73%) ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి బరిలోకి దిగబోతున్నారు.
అయితే... సోము వీర్రాజు కు అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తే ఈమె తన నియోజకవర్గానికి మార్చుకునే ఆలోచనలో ఉన్నారనే కథనాలూ తాజాగా తెరపైకి వచ్చాయి! ఇక, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి 1,21,634 ఓట్ల మెజారిటీ దక్కింది!
నరసాపురం - శ్రీనివాస వర్మ:
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ స్థానం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఏదైనా నరసాపురం టిక్కెట్ నాదే అని చెప్పుకున్న రఘురామ కృష్ణంరాజుకి కాకుండా.. ఈ టిక్కెట్ అనూహ్యంగా అన్నట్లుగా భూపతిరాజు శ్రీనివాస వర్మకు దక్కింది. పైన చెప్పుకున్న ఐదుగురు అభ్యర్థులూ వలసనేతలైనప్పటికీ... ఈయన మాత్రం మొదటినుంచీ బీజేపీలోనే ఉన్నారు!! ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీకి 31,909 ఓట్ల మెజారిటీ వచ్చింది!
జీవీఎల్ అసంతృప్తి గళం!:
కూటమిలో భాగంగా టిక్కెట్లు దక్కించుకున్న వారి ప్రస్థావన వచ్చినప్పుడల్లా... అసలు సిసలు బీజేపీ నేతలకు కాకుండా.. వలస పక్షులకే టిక్కెట్లు దక్కాయనే మాటలు ఆ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీని పూర్తిగా వలస నేతలు ఆక్రమించేశారని వారు అంటుంటారు. ఈ క్రమంలో జీవీఎల్ నరసింహరావుకు బీజేపీ ఎంపీ టిక్కెట్ దక్కకపోవడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తుంది.
గత కొన్ని సంవత్సరాలుగా "జీవీఎల్ ఫర్ వైజాగ్" అంటూ పనులు చేసుకుంటూ, స్థానికంగా పార్టీనీ, కేడర్ నూ బలపరుచుకుంటూ పనిచేసుకుంటున్నట్లు చెబుతున్న జీవీఎల్ కి విశాఖలో హ్యాండ్ ఇచ్చింది బీజేపీ అధిష్టాణం. పోనీ పక్కనున్న అనకాపల్లి అయినా కేటాయించిందా అంటే... కడప నుంచి సీఎం రమేష్ ని తీసుకొచ్చిందనే కామెంట్లు అక్కడ బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆయన కాస్త నిరసన గళం వంటిది వినిపించారు.
మూడేళ్ల నుంచి తాను విశాఖలోనే ఉంటూ.. స్థానిక ప్రజలకు చేరువయ్యినట్లు చెప్పిన జీవీఎల్.. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఆయా సమస్యలపై పోరాడినట్లు చెప్పారు. అయితే తన నిస్వార్ధమైన సేవ వృథా అయ్యిందన్నట్లుగా స్పందించిన ఆయన... త్వరలోనే విశాఖకు వచ్చి, తన అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తానని తెలిపారు. దీంతో... ఈయన ప్రభావం విశాఖ, అనకాపల్లి లోక్ సభ స్థానాలపై పడే అవకాశంపైనా చర్చ నడుస్తోంది.