Begin typing your search above and press return to search.

భారీ మెజార్టీలకు జగనే కారణం.. కూటమి ఎంపీ సంచలనం!

ఈ నేపథ్యంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు భారీ మెజార్టీలు రావడానికి జగనే కారణమని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   7 July 2024 9:13 AM GMT
భారీ మెజార్టీలకు జగనే కారణం.. కూటమి ఎంపీ సంచలనం!
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. వై నాట్‌ 175 అంటూ ఉవ్విళ్లూరిన వైసీపీ 11 స్థానాలకే పతనమైంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తాము ఎందుక ఓడిపోయామో, ఎక్కడ లోపాలు జరిగాయో, ఓటమికి ఎవరు కారణమో చెబుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కరణం ధర్మశ్రీ, కాసు మహేశ్‌ రెడ్డిలాంటివారు జగన్‌ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఈ నేపథ్యంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు భారీ మెజార్టీలు రావడానికి జగనే కారణమని వ్యాఖ్యానించారు. టీడీపీ కూటమి భారీ విజయం వెనక తాము గట్టిగా పోరాడటంతోపాటు జగన్‌ చేసిన భారీ తప్పిదాలే కారణమయ్యాయన్నారు. జగన్‌ తప్పుల వల్లే కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీలు వచ్చాయని తెలిపారు

జగన్‌ వేయి తప్పులు చేశారని సీఎం రమేశ్‌ తెలిపారు. ఆయన చేసిన ఈ తప్పులే కూటమి పార్టీలకు వరంగా మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో 20 నియోజకవర్గాల్లో వరకు తమ కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీలు రావడం జగన్‌ పుణ్యమేనని సీఎం రమేశ్‌ వెటకారంగా వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ఎవరూ ఊహించని మెజారిటీలు కూటమి అభ్యర్థులకు వచ్చాయని సీఎం రమేశ్‌ గుర్తు చేశారు. మళ్లీ భవిష్యత్తులో ఈ స్థాయి మెజార్టీలు ఏ పార్టీకి రాకపోవచ్చని స్పష్టం చేశారు. అసెంబ్లీకి పోటీ చేసిన వారికి సైతం 90 వేలకు పైగా మెజారిటీలు వచ్చాయన్నారు. దీనికి జగన్‌ చేసిన తప్పులే కారణమని సీఎం రమేశ్‌ తేల్చిచెప్పారు.

ఇప్పటికే ఓవైపు వైసీపీ నేతలు తమ అధినేత జగన్‌ తప్పుడు నిర్ణయాలే తమ కొంప ముంచాయని చెబుతున్నారు. ముఖ్యంగా వలంటీర్ల వ్యవస్థతో నాయకులు, కార్యకర్తలకు ప్రజలతో సంబంధాలు లేకండా పోయాయంటున్నారు. అలాగే సీఎం జగన్‌ ను కలవనీయకుండా సీఎం కార్యాలయంలో ధనుంజయరెడ్డి అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు.

రోడ్లు, తదితర మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా జగన్‌ ఇవ్వలేదని దీంతో ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వైసీపీ నేతలు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు సైతం జగన్‌ చేసిన భారీ తప్పిదాలే తమ గెలుపుకు రాచబాట పరిచాయని ఒప్పుకుంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదో జగన్‌ చేసి చూపించారన్నారు. వైసీపీ నేతల మాదిరిగా ఎవరూ వ్యవహరించొద్దని తన పార్టీ నేతలకు సూచించారు.