Begin typing your search above and press return to search.

ఎందుకు చిన్న‌మ్మా.. ప‌నిలేని ప‌నులు..!

కానీ, అస‌లు విష‌యం ఏంటంటే.. ఇన్నాళ్ల‌లో బీజేపీ నాయ‌కులకు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలియ‌వా? అనేది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 12:30 AM GMT
ఎందుకు చిన్న‌మ్మా.. ప‌నిలేని ప‌నులు..!
X

పులిని చూసిన‌క్క వాతలు పెట్టుకున్న‌ట్టుగా ఉంది.. రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి. టీడీపీ, జ‌న‌సేన‌లు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ.. వారి నుంచి విన‌తులు తీసుకుంటున్నాయి. టీడీపీ ప్ర‌జా ద‌ర్బార్ పేరుతోను, జ‌న‌సేన జ‌న వాణి పేరుతోనూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాయి. దీనికి పుంఖాను పుంఖాలుగా ప్ర‌జ‌లు త‌మ విన‌తులు స‌మ‌ర్పిస్తున్నారు. పెద్ద ఎత్తున క్యూలు కూడా క‌డుతున్నారు. అయితే.. దీనిని చూసి బీజేపీ కూడా ఇప్పుడు `సార‌థి` పేరుతో ఈ నెల 15 నుంచి ప్ర‌జ‌ల నుంచి విన‌తులు తీసుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

దీనిని పెద్ద గొప్ప‌గా కూడా ప్ర‌చారం చేసుకుంటోంది. కానీ, అస‌లు విష‌యం ఏంటంటే.. ఇన్నాళ్ల‌లో బీజేపీ నాయ‌కులకు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలియ‌వా? అనేది. పైగా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని ఏం చేస్తారు?అంటే.. మ‌ళ్లీ రాష్ట్ర స‌ర్కారుకే విన్న‌వించి.. చంద్ర‌బాబు ద్వారా ఆయా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని క‌మ‌ల నాథులు చెబుతున్నారు. ఇంతోటి దానికి పెద్ద ఎత్తున హంగామా ఎందుకు? ఎలానూ టీడీపీ ఇదే ప‌నిచేస్తోంది. కూట‌మి పార్టీ జ‌న‌సేన కూడా ఇదే ప‌ని చేప‌ట్టింది. మ‌రి బీజేపీతో ప‌నేంటి?

అయినా.. బీజేపీ చేయాల్సిన ప‌ని వేరేగా ఉంద‌ని అంటున్నారు. రాష్ట్రంలో ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త ఫిర్యాదులు తీసుకునేందుకు, వారి స‌మ‌స్య‌లు వినేందుకు నేరుగా చంద్ర‌బాబు రంగంలోకి దిగిన త‌ర్వాత‌.. అస‌లు వేరే పార్టీల‌కు కూడా ప‌నిలేదు. పోనీ.. కేంద్రంలో అధికార కూట‌మిలో ఉన్నా.. అధికారంలో అయితే.. ప్ర‌త్య‌క్షంగా లేనందున జ‌న‌సేన ప‌ట్టించుకుందంటే ఒక అర్థం ఉంది. పైగా ఇది ప్రాంతీయ పార్టీ. కానీ, జాతీయ పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బీజేపీ చేయాల్సింది కూడా.. ఈ కాపీ కార్య‌క్ర‌మ‌మే నా?

అస‌లు ఇప్పుడు బీజేపీ చేయాల్సిన ప‌ని.. ప్ర‌జ‌ల కోసం కాదు. రాష్ట్రం కోసం. కేంద్రం నుంచి తీసుకురావా ల్సిన నిధుల‌పై రాష్ట్రం త‌ర‌ఫున వాయిస్ వినిపించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్య‌వ‌హారం తేల్చాలి. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీని నిర్మించాలి. అదేస‌మ‌యంలో వెనుక‌బ‌డిన జిల్లాల‌కునిధులు తీసుకురావాలి. కేంద్రం నుంచి ఒన‌గూర్చాల్సిన ప్ర‌యోజ‌నాలు రాబ‌ట్టాలి. నీటి వివాదాల‌పై ప్ర‌య‌త్నించాలి. వీటిని వ‌దిలేసి.. ఏదో చేస్తున్నామంటే.. చేస్తున్నామ‌న్న‌ట్టుగా.. కంటితుడుపు కార్య‌క్ర‌మాలు, కాపీ కొట్టే కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌యోజ‌నం ఏంట‌నేది పురందేశ్వ‌రికి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌లు.