అంతొద్దు.. అది చాలు...బీజేపీ కొత్త బేరం..బాబుకు ఓకేనా...!?
ఏపీలో టీడీపీ గెలవాలన్నా గెలిచి అయిదేళ్లు రాజ్యం చేయాలన్నా ఇపుడు బీజేపీ సాయం అవసరం అని అంటున్నారు.
By: Tupaki Desk | 16 Feb 2024 5:30 PM GMTభారతీయ జనతా పార్టీతో పొత్తు టీడీపీకి ప్రాణ సంకటంగా మారుతోంది. ఒక విధంగా పులి మీద స్వారీగా ఉంది అంటున్నారు. పొత్తు ఉన్నా లేకపోయినా రెండూ ఇబ్బందిగానే ఉన్నాయి. పైగా కేంద్రంలో మూడవసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కచ్చితంగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ గెలవాలన్నా గెలిచి అయిదేళ్లు రాజ్యం చేయాలన్నా ఇపుడు బీజేపీ సాయం అవసరం అని అంటున్నారు.
అందుకే బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వచ్చారు. అమిత్ షాతో చర్చించిన తరువాత కూడా పది రోజులు ఇట్టే గడచిపోయాయి. కానీ అఫీషియల్ గా ఏమీ తేలలేదు, ఏ ప్రకటనా రాలేదు. దాంతో ఏమి జరుగుతోంది అన్న చర్చ కూడా ఉంది.
ఇదిలా ఉంటే తమ పార్టీ ముఖ్యులతో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు విషయంలో సానుకూలంగా మాట్లాడారు అని అంటున్నారు. అంటే బీజేపీతో పొత్తు ఇష్టమే కానీ ఆ పార్టీ పెడుతున్న ప్రతిపాదనలే కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని అంటున్నారు. అదే టైం లో ఏపీలో ఉన్న మొత్తం పాతిక పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు సీట్లలో టీడీపీకి నాలుగు జనసేనకు రెండు బీజేపీకి ఒక సీటు అన్న ఫార్ములాతో అమిత్ షా బాబు వద్ద బేరం పెట్టారు అని అంటున్నారు.
అయితే ఈ ప్రతిపాదన ప్రకారం చూస్తే టీడీపీ వంద సీట్లలో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. జనసేనకు యాభై బీజేపీకి పాతిక సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోనే టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది అని అంటున్నారు. ఈ పొత్తు ప్రతిపాదన ఇలా ఉండగానే బహుశా టీడీపీ ఆలోచనలు పసిగట్టారో లేక ఎవరైనా చెప్పారో తెలియదు కానీ మరో ప్రతిపాదన బీజేపీ నుంచి లేటెస్ట్ గా వచ్చింది అని అంటున్నారు.
ఆ ప్రతిపాదన ప్రకారం చూస్తే ఎమ్మెల్యే సీట్లు అయిదు బీజేపీ తగ్గించుకుంది అని అంటున్నారు. అంటే ఇరవై ఎమ్మెల్యే సీట్లు ఆరు దాకా ఎంపీ సీట్లు ఇస్తే పొత్తు ముందుకు వెళుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో కూడా పితలాటకం ఉందని అంటున్నారు. అదెలా అంటే బీజేపీ కోరుతున్న ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ టీడీపీ బలంగా ఉండే ప్రాంతాలలోనే అంటున్నారు.
అదెలా ఉన్నాయంటే ఎంపీ స్థానాల్లో విశాఖపట్నం, నర్సాపురం, రాజమండ్రి, విజయవాడ, హిందూపురం, రాజంపేట లేదా తిరుపతి కోరుతున్నారు. అదే విధంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను ప్రతిపాదించారు. అందులో రాజమండ్రి సిటీ, పి గన్నవరం (ఎస్సీ), కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ వంటి టీడీపీ కీలక స్థానాలు కూడా ఉన్నాయి.
అలాగే తిరుపతి లేదా శ్రీకాళహస్తి, మదనపల్లె, విశాఖ ఉత్తరం, అరకు, శ్రీకాకుళం, నెల్లూరు సిటీ లేదా రూరల్, ఒంగోలు, నర్సరావుపేట, ప్రత్తిపాడు, బాపట్ల, కాకినాడ సిటీ, ఏలూరు, జమ్మలమడుగు, ధర్మవరం ఇవ్వాలనేది బీజేపీ తాజా ప్రతిపాదనగా ఉంది. అయితే బీజేపీ ప్రతిపాదన ఎలా ఉంది అంటే అయిదూళ్ళు చాలు అని కీలక స్థావరాలనే కోరినట్లుగా ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఇప్పటికే చంద్రబాబు జనసేన బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది. దానిని బట్టి చూస్తే కనుక జనసేనకు 25 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలు అని అంటున్నారు. అలాగే బీజేపీకి పది ఎమ్మెల్యే, నాలుగు దాకా ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఓకేగా ఉంది అని అంటున్నారు. ఇవి కూడా టీడీపీ తాను సూచించిన సీట్లనే ఇచ్చేందుకే సిద్ధం అంటున్నారు.
అంటే టీడీపీ చెప్పిన నంబర్ కి చూపించే సీట్లకు బీజేపీ అయినా జనసేన అయినా ఒప్పుకోవాలి అన్న మాట. మరి బీజేపీ అలా కాదూ కూడదు అంటే ఈ పొత్తు ఏమవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా జనసేనతో కొంత బాగానే ఉన్నా ఈసారి బీజేపీ నుంచే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. దీంతో బీజేపీని ఒప్పించే పనిలో పవన్ తొందరలో ఢిల్లీ టూర్ వేయనున్నారు అని ప్రచారం కూడా సాగుతోంది.