వైజాగ్ స్టీల్‌ప్లాంట్ః తొడగిల్లి బుజ్జగిస్తున్న బీజేపీ... నమ్మాల్సిందేనా
ఈ సందర్బంగా విశాఖ ఉక్కు భవిష్యత్ విషయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తిగా ఉన్న పరిశ్రమ పరిరక్షణ అందరి బాధ్యతగా పేర్కొన్న ఎంపీ జీవీఎల్..
By: Tupaki Desk | 28 Sep 2023 2:45 AM GMTఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కీలక రాష్ట్రాలు, దక్షిణాదిలోని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆంధ్రుల హక్కు... విశాఖ ఉక్కు అనేంతగా తెలుగు వారిలో పెనవేసుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే విషయంలో ఇన్నాళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెనకడుగు వేసింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఈ వివరాలను తాజాగా వెల్లడించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని ఎంపీ జీవీఎల్ ప్రకటించారు. ఉక్కు శాఖ సహాయమంత్రి కులస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సందర్శించి యాజమాన్యం, కార్మిక సంఘాలతో వేరు వేరుగా సమావేశమై కేంద్రం నిర్ణయం వెల్లడించాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో రద్దు అయిందని జీవీఎల్ తెలిపారు. ప్రైవేటీకరణను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన రద్దు అయ్యిందని జీవీఎల్ వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాను వెల్లడిస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్బంగా విశాఖ ఉక్కు భవిష్యత్ విషయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తిగా ఉన్న పరిశ్రమ పరిరక్షణ అందరి బాధ్యతగా పేర్కొన్న ఎంపీ జీవీఎల్... విశాఖ ఉక్కు పబ్లిక్ సెక్టార్ లో కొనసాగాలంటే లాభాల బాట పట్టించాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నష్టాలు., ఐరన్ ఓర్ మైనింగ్ ఇవ్వకపోవడం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందా..? అని ప్రశ్నించారు. 'ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని కార్మిక సంఘాలను కోరుతున్నాం. బ్లాస్ట్ ఫర్నేస్-3ని ప్రారంభిస్తాం.. రాయబరేలిలో ఉన్న రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ ద్వారా 2 వేల కోట్ల మూలధనం సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిల్లేట్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
అయితే, హఠాత్తుగా బీజేపీ వైజాగ్ ఉక్కు విషయంలో వెనకడుగు వేయడంలో పలు కారణాలు ఉన్నాయంటున్నారు. కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశం వల్ల ఎన్నికల ముందు వ్యతిరేకతను తీసుకుని రాకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో సున్నితంగా వ్యవహరిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యథాతథ స్థితి కొనసాగించే విధంగా కేంద్రం సంకేతాలు పంపించడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు. మరోవైపు, సంబంధిత మంత్రి దీనిపై ప్రకటన చేస్తే మరింత స్పష్టత వస్తుందని కార్మిక సంఘాలు, కార్మికులు పేర్కొంటున్నారు.