Begin typing your search above and press return to search.

బీజేపీకి జగన్ అవసరం పడుతుందా ?

వారు వీరూ చెప్పారు అని కాదు కానీ బీజేపీ అగ్రనేతలు మోడీ అమిత్ షాల సొంత స్టేట్ గుజరాత్ లోనే పరిస్థితి కొంత మారుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 May 2024 3:38 AM GMT
బీజేపీకి జగన్ అవసరం పడుతుందా ?
X

కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది తెలియడం లేదు. ఉత్తరాదిన బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఇండియా కూటమి నేతలు అదే పనిగా చెబుతున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే బీజేపీకి 200 సీట్లు మాత్రమే ఇచ్చారు. కేజ్రీవాల్ ఇండియా కూటమి మూడు వందల సీట్లతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. యూపీకి చెందిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అయితే మొత్తం 80 ఎంపీ సీట్లకు గానూ 79 సీట్లు ఇండియా కూటమి యూపీలో గెలుచుకుంటుంది అని క్లారిటీగా చెప్పారు.

వారు వీరూ చెప్పారు అని కాదు కానీ బీజేపీ అగ్రనేతలు మోడీ అమిత్ షాల సొంత స్టేట్ గుజరాత్ లోనే పరిస్థితి కొంత మారుతోంది అని అంటున్నారు. గతసారి ఆప్ ఓట్ల చీలికతో కాంగ్రెస్ నష్టపోయి బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఈసారి ఆప్ కాంగ్రెస్ కలసి పోటీ చేస్తున్నాయి. దాంతో బీజేపీ వ్యతిరేక ఓట్ల చీలికను అడ్డుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే బీజేపీకి భారీ నష్టం గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్, మధ్యప్రదేశ్ మీదుగా ఢిల్లీ యూపీ దాకా సాగుతుందని అంటున్నారు.

అలాగే మహారాష్ట్రతో పాటు బీహార్ పశ్చిమ బెంగాల్ లలో కూడా కమలానికి ఎదురు గాలి వీచడం ఖాయమని అంటున్నారు. దాంతో బీజేపీకి 200 సీట్లు సొంతంగా ఎన్డీయే మిత్రులకు ముప్పయి సీట్లు మాత్రమే వస్తాయని ఇండియా కూటమి నేతలు తమదైన సర్వే రిపోర్టుని ముందుంచారు.

ఎన్డీయే మిత్రులలో తెలుగుదేశం, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, మహారాష్ట్రలో ఏక్ నాధ్ షిండే నాయకత్వంలోని శివసేన, అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. ఇవి పెద్ద పార్టీలు వీటికి అన్నింటికీ కలిపి ముప్పయి ఎంపీ సీట్లే వస్తాయంటే ఇండియా కూటమి అంచనాలు ఏపీలో కూడా ఎన్డీయే కూటమి తగినన్ని ఎంపీ సీట్లు సాధించలేదు అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.

అదే సమయంలో వైసీపీ ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు సాధించేలా ఉందని కూడా అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఇండియా కూటమికి కానీ ఎన్డీయే కూటమికి కానీ సొంతంగా మెజారిటీ రాకపోతే అపుడు పరిస్థితి ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఎన్డీయే కూటమికి 230 దాకా సీట్లు వస్తే కనుక అంటే ఇండియా కూటమి వారి జోస్యం ప్రకారం అనుకుంటే అపుడు ఏపీలోని జగన్ అవసరం కచ్చితంగా పడుతుంది అని అంటున్నారు.

ఏపీలో వైసీపీకి 20 సీట్లకు తక్కువ కాకుండా వస్తే మాత్రేం ఎన్డీయేకి ఈ మద్దతు ఆక్సిజన్ అవుతుందని అంటున్నారు. జగన్ సైతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి ఈసారి తగినన్ని సీట్లు రాకపోవచ్చు అని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆడ్డుకుంటామని హామీ ఇచ్చారు.

అలాగే జగన్ కానీ వైసీపీ నేతలు కానీ కేంద్రంలో ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఉండే పరిస్థితి ఉందని అన్నారు. తమకు ఎన్డీయే కూటమి అయినా ఇండియా కూటమి అయినా ఒక్కటే అని కూడా అన్నారు. తమ మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీకి సంబంధించిన అన్ని సమస్యలు సాకారం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఆయన కంటే ముందు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విధంగా మాట్లాడారు.

దీనిని బట్టి చూస్తూంటే బీజేపీకి ప్రాణ వాయువును అందించడం ద్వారా కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో అతి ముఖ్య పాత్రను తాము పోషించాలని వైసీపీ చూస్తోంది అని అర్ధం అవుతోంది. అయితే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీయే మిత్రులతో కలిపి 400 సీట్లు వస్తాయని చెప్పుకుంటోంది. ప్రతీ విడత పోలింగ్ తరువాత తమకు వచ్చే సీట్ల నంబర్ ని కూడా పెంచుకుంటూ పోతోంది బీజేపీ.

అయితే ఇటీవల వారణాసిలో తన నామినేషన్ దాఖలు సందర్భంగా మోడీ ఎన్డీయే మిత్రులతో సడెన్ గా మీటింగ్ పెట్టడం, అలాగే బీజేపీ ఎన్నడూ లేని విధంగా పాత మిత్రులను దువ్వి మరీ తమ జట్టులో కలుపుకోవడం, అనేక భావోద్వేగ అంశాలతో ప్రచారం ఉధృతంగా చేయడం వంటివి చూస్తే కనుక కమలనాధులలో ఎక్కడో డౌట్ ఉందని విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ రెండు సార్లు దేశంలో అధికారంలోకి వచ్చింది. తొలిసారి మోడీ ఇమేజ్ పనిచేస్తే రెండవసారి పుల్వామా దాడులతో ఎమోషన్ క్రియేట్ అయి ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూరింది.

ఈసారి రామమందిరం ఇష్యూ హైలెట్ అవుతుంది అనుకున్నా కూడా అది ఏమీ వర్కౌట్ కావడం లేదు. జనాలతో కనెక్ట్ అయ్యే ఇష్యూస్ అయితే లేవు. చప్పగానే బీజేపీ ప్రచారం సాగుతోంది.దాంతో అద్భుతమైన ఫలితాలు ఈసారి ఎందుకు వస్తాయన్నది ఒక చర్చ.

ఇండియా కూటమి వైపు చూస్తే పదేళ్ళ బీజేపీ యాంటీ ఇంకెంబెన్సీ పెట్టుబడిగా ముందుకు సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని ఐక్యతను చూపిస్తోంది. దాంతో హిందీ బెల్ట్ లో ధీటైన పోటీని తొలిసారి బీజేపీ చూస్తోంది. మరి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ అందుతుందా లేక జగన్ అవసరం పడుతుందా అంటే వెయిట్ అండ్ సీ.