టీడీపీకి స్పీకర్ పదవి ఆఫర్.. చంద్రబాబు రియాక్షన్ ఇదీ!
కట్ చేస్తే.. ప్రస్తుతం కూడా.. మోడీ సర్కారులో చంద్రబాబు కీలక భాగస్వామి.
By: Tupaki Desk | 23 Jun 2024 11:30 AM GMTకేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి మరో కీలక అవకాశం దక్కింది. గతంలో వాజపేయి ప్రభు త్వం ఉన్న సమయంలో మాదిరిగానే ఇప్పుడు కూడా.. పార్లమెంటు లోక్‌సభ స్పీకర్ పదవి టీడీపీని వరించింది. గతంలో చంద్రబాబు ఈ పదవిని తీసుకున్నారు. దీనికి అమలాపురం అప్పటి ఎంపీ.. గంటి మోహనచంద్రబాలయోగిని నియమించారు. ఆయనకు హిందీ రాకపోయినా... నేర్చుకుని సమర్థవంతం గా పదవికి వన్నె తెచ్చారు.
కట్ చేస్తే.. ప్రస్తుతం కూడా.. మోడీ సర్కారులో చంద్రబాబు కీలక భాగస్వామి. దీంతో ఇప్పుడు కూడా.. స్పీకర్ పదవిని ఇస్తామంటూ.. కేంద్రం చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. చంద్రబాబు కు స్వయంగా ఫోన్ చేసి.. స్పీకర్ పదవిని మీరు తీసుకుంటే బాగుటుంద ని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పదవిని వేరే పార్టీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే.. చంద్రబాబు ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
ఈ విషయాన్ని తాజాగా చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. రాష్ట్రం, దేశం అభివృద్ధే ముఖ్యమని.. స్పీకర్ పదవి తమకు అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలిపారు. కాగా.. ప్రస్తుతం కేంద్రంలో రెండు మంత్రి పదవులు టీడీపీ ఎంపీలకు దక్కిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం ఎంపీ.. కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు పౌర విమానయాన మంత్రి పదవి దక్కింది. ఇక, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు స్పీకర్ పదవిని ఇస్తామని ఆఫర్ చేసినా.. చంద్రబాబు తిరస్కరించారు.
రీజనేంటి?
స్పీకర్‌గా బాధ్యతలు తీసుకుంటే.. కేంద్రంపై ఒత్తిడి పెంచలేమని చంద్రబాబు భావించి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. ఇదేసమయంలో అవసరమైతే.. బయటకు వచ్చేందుకు కూడా అవకాశం తక్కువగా ఉంటుందని.. స్పీకర్ పదవిని తీసుకుని లేనిపోని బాధ్యతలను నెత్తిన వేసుకున్నట్టుగా ఉంటుందని కూడా ఆయన తలపోసి ఉంటారని చెబుతున్నారు. ఏదేమైనా లోక్‌సభ స్పీకర్ పదవిని వదులుకున్నారు.