ఓటర్లకు బీజేపీ బంపరాఫర్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతు మధ్యప్రదేశ్ లో జనాలు బీజేపీని గెలిపిస్తే అయోధ్యలో రామమందిరం దర్శనం చేయిస్తామని ప్రకటించారు.
By: Tupaki Desk | 14 Nov 2023 2:30 PM GMTఅభివృద్ధి లేకపోతే సంక్షేమపథకాల అమలు ద్వారా జనాలతో ఓట్లేయించుకోలేమని బీజేపీకి అర్ధమైపోయినట్లుంది. అందుకనే సెంటిమెంటును ప్రయోగించింది. ఇంతకీ విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతు మధ్యప్రదేశ్ లో జనాలు బీజేపీని గెలిపిస్తే అయోధ్యలో రామమందిరం దర్శనం చేయిస్తామని ప్రకటించారు. అదికూడా జనాలను అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్ళి శ్రీరాముడి దర్శనం చేయిస్తామని గాలమేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవటానికి, ఓట్లు వేయించుకోవటానికి సెంటిమెంటు ఒక్కటే మార్గమని అమిత్ షా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ లో బీజేపీ పరిపాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఓటమి తప్పదని ప్రీపోల్ సర్వేల్లో స్పష్టంగా బయటపడింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిపాలన అంతా అవినీతి, అరాచకాలే అని జనాలు అభిప్రాయపడుతున్నట్లు అనేక సర్వేల్లో బయటపడింది. దాంతో రెండోసారి గెలుపుపై బీజేపీలో ఆశలు వదిలేసుకున్నట్లు అర్ధమవుతోంది. అయినా గెలుపుపై ఆశలు వదులుకోకుండా ఇపుడు సింటిమెంటును ప్రయోగిస్తున్నారు.
నిజానికి ఎన్నికల్లో మతపరమైన ప్రచారం చేయకూడదన్నది చాలా కీలకమైన నిబంధన. బీజేపీని గెలిపిస్తే అయోధ్యకు జనాలను ఉచితంగా తీసుకెళ్ళి దర్శనం చేయిస్తామని స్వయంగా అమిత్ షా చెప్పటమంటే నిబంధనలను ఉల్లంఘించటమే. ఎన్నికల నిబంధనను ఉల్లంఘిస్తున్న విషయం అమిత్ షాకు తెలీకుండానే ఉంటుందా ? తెలిసే జనాలపైకి సెంటిమెంటును ప్రయోగించారని అర్ధమైపోతోంది. తన పాలనలో చౌహాన్ ప్రజా వ్యతిరేకతను బాగా మూటకట్టుకున్నారు. ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం చేసినా అన్నింటిలోను అవినీతే కనబడుతోంది.
ప్రభుత్వపరంగా చేసిన నిర్మాణాలు కూడా కుప్పకూలిపోతున్నాయి. చాలా నిర్మాణాలు నాసిరకమనే విషయాలు దర్యాప్తుల్లో బయటపడ్డాయి. ప్రభుత్వపరంగా జరిగిన అనేక తప్పులకు అదనంగా పార్టీలో ఆధిపత్య గొడవలు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకనే చౌహాన్ ఒక్కరికే పగ్గాలు అప్పగించకుండా ఏకంగా 15 మందితో ఎన్నికల కమిటిని వేసింది. అయినా అప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాని ప్రభావం ప్రచారానికి వెళ్ళినపుడు నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులకు స్పష్టంగా కనబడినట్లుంది. అందుకనే తాజాగా ఆఖరి అస్త్రంగా సెంటిమెంటును ప్రయోగించారు. మరి ఎంత వర్కవుటవుతుందో చూడాలి.