Begin typing your search above and press return to search.

బీజేపీ - బీజేడీ... ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు!

ప్రధానంగా జాతీయ స్థాయిలో ఇండియా - ఎన్డీయే కూటముల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చలు తీవ్రంగా జరిగాయి.

By:  Tupaki Desk   |   2 Jun 2024 1:46 PM GMT
బీజేపీ - బీజేడీ... ఆసక్తికరంగా ఎగ్జిట్  పోల్  ఫలితాలు!
X

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు జూన్ 1 సాయంత్రం విడుదలయ్యాయి. దీంతో జూన్ 4 కంటే ముందే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఇండియా - ఎన్డీయే కూటముల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చలు తీవ్రంగా జరిగాయి.

ఈ క్రమంలో మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని.. మోడీ హ్యాట్రిక్ కన్ ఫాం అని చెబుతున్న పరిస్థితి. మరోపక్క ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ కాదు.. మోడీ మీడియా పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపు నుంచి సెటైర్లు పడుతున్నాయి. ఈ సమయంలో ఒడిశా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

అవును... 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశా రాష్ట్రంలోనూ లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలూ జూన్ 4న వెలువడనున్న నేపథ్యంలో... ఈలోపు తెరపైకి వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇందులో భాగంగా... అసలు హోరా హోరీ అంటే ఏమిటో ఇలా ఉంటుంది అన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి.

ఇందులో భాగంగా... ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) - బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఇందులో భాగంగా ఈ రెండు పార్టీలకూ 62 - 80 సీట్ల చొప్పున వచ్చే అవకాశం ఉందంటూ అంచనా వేసింది.

అంటే.. ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థపై సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 - 8 స్థానాల్లో గెలుస్తుందని అభిప్రాయపడింది. అయితే... పోలింగ్ పర్సంటేజ్ విషయంలో మాత్రం కాస్త చిన్నపాటి వేరియేషన్ చూపించింది.

ఇందులో భాగంగా.. బీజేడీకి 42 శాతం, బీజేపీకి 41 శాతం, కాంగ్రెస్ కు 12 శాతం, ఇతరులకు 4 - 5 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగునంగానే ఎగ్జాట్ ఫలితాలు వస్తాయా.. లేదా అనేది వేచి చూడాలి.