ఇద్దరు చంద్రులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న బీజేపీ...?
తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు రాజకీయ చంద్రులు
By: Tupaki Desk | 20 July 2023 11:38 AM GMTతెలుగు రాష్ట్రాలలో ఇద్దరు రాజకీయ చంద్రులు ఉన్నారు. ఈ ఇద్దరూ రాజకీయ చాణక్యం బహు గట్టిది. ఇక ఈ ఇద్దరూ జాతీయ రాజకీయాలను సైతం తమదైన తీరులో ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్నారు. అనేక కూటములను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీకి చుక్కలు చూపించిన నైపుణ్యం చంద్రబాబుదైతే. తన టీయారెస్ ని బీయారెస్ గా మర్చి జాతీయ స్థాయిలో బీజేపీని సవాల్ చేస్తున్న మరో రాజకీయ దిగ్గజం కేసీయార్.
ఇపుడు ఈ ఇద్దరు చంద్రులకు ఇంట గెలవాల్సిన అవసరం అయితే గట్టిగా ఉంది. అందుకే ఈ ఇద్దరినీ ఇంటి గడప దాటి బయటకు రానీయకుండా బీజేపీ భారీ స్కెచ్ వేస్తోంది అని అంటున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని తన రాజకీయ చాణక్యంతో సాధించి రెండు సార్లు సీఎం అయిన కేసీయర్ రాజకీయ గండర గండగా పేరు గడించారు.
అలాంటి కేసీయార్ మూడవసారి గెలిస్తే కనుక ఆయన్ని పట్టడం కష్టమే అన్నది కమలనాధుల అంచనా. కేసీయార్ జాతీయ రాజకీయాల మీద సీరియస్ గా దృష్టి పెడతారని అంటున్నారు. ఆయన బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగట్టి జాతీయ స్థాయిలో బీజేపీకి ఆల్టర్నేషన్ ని ఇచ్చే ఆలోచనకు మరింత పదును పెడతారు అని అంటున్నారు.
అందుకే కేసీయార్ ని తెలంగాణాలో ఈసారి కనుక ఓడిస్తే ఆయన జాతీయ రాజకీయం ఇక ఉండదన్నది బీజేపీ పెద్దల ప్లాన్. అందుకోసం తెలంగాణాలో కూడా జనసేనతో పొత్తులు పెట్టుకుని బీయారెస్ కి ధీటుగా ఎదగాలని బీజేపీ గట్టిగా తలపోస్తోంది అని అంటున్నారు. కాంగ్రెస్ ని బీయారెస్ ని నిలువరించడం బీజేపీ తక్షణ అవసరం తెలంగాణాలోనే అని అంటున్నారు.
ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. బాబు 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే జాతీయ రాజకీయాల వైపు చూడడం లేదు అన్నది తెలిసిందే. ఆయన కనుక ఒక్కసారి ఏపీలో అధికారం దక్కించుకుంటే కచ్చితంగా ఢిల్లీ బాట పడతారని, బాబు రాజకీయ చక్రం మరోమారు హస్తినలో గిర్రున తిరిగే అవకాశం ఉందని అంటున్నారు.
బాబు కెపాసిటీ టాలెంట్ బీజేపీకి బాగా ఎరుక అని అంటున్నారు. అందుకే ఆయన్ని ఏపీకి పరిమితం చేయాలీ అంటే ఆ పార్టీతో ఎలాంటి పరిస్థితుల్లోనూ జట్టు కట్టరాదని అంటున్నారు. ఏపీలో బాబుకు మద్దతుగా నిలిస్తే ఆయన గెలిస్తే అపుడు బాబు జాతీయ చక్రం తమ వైపే దూసుకుని వచ్చినా రావచ్చు అన్నది కమలనాధుల అనుమానం కలవరం కూడా అంటున్నారు.
ఏపీలో జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తే ఓట్లు చీలి వైసీపీ మరోమారు సులువుగా గెలిచేందుకు వీలు కలుగుతుందన్నది కాషాయం మార్క్ మాస్టర్ స్కెచ్ అని అంటున్నారు. అదే టైం లో టీడీపీకి ధీటుగా తాము ప్రతిపక్షంగా నిలదొక్కుకుంటే 2019లో ఏపీలో పాగా వేయవచ్చు అన్నది మరో ప్లాన్.
ఈ కారణాలతోనే ఏపీలో బీజేపీ టీడీపీని దగ్గరకు రానీయడంలేదని అంటున్నారు. టీడీపీ అయితే ఎన్డీయేలో చేరాలని చూస్తోంది. కేంద్రంలోని ప్రభుత్వం అండతో ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. అదే విధంగా చూస్తే మూడు పార్టీలు కలిస్తే ఓట్ల చీలిక ఉండదని, కచ్చితంగా వైసీపీకి ఓటమి రుచి చూపించవచ్చు అని భావిస్తోంది. కానీ బీజేపీకి మాత్రం ఏపీలో బాబుని నిలువరించడమే తక్షణ కర్తవ్యంగా ఉంది అని అంటున్నారు.
అంటే 2024లో కేంద్రంలో బీజేపీకి తగినంత మెజారిటీ రాకపోతే ఇద్దరు చంద్రులు కూటములను కట్టి మరీ మూడవసారి బీజేపీకి అధికారం రాకుండా చేస్తారు అన్న కంగారు అయితే ఉందిట. మొత్తం మీద చూస్తే ఇద్దరు చంద్రులను బీజేపీ గట్టిగా టార్గెట్ చేసింది అని అంటున్నారు.