ఏపీలో పొత్తులకు బీజేపీ ఇచ్చిన సంకేతం ఇదే...?
ఏపీలో ఎన్నికల ముందు కచ్చితంగా బీజేపీ పొత్తులకు టీడీపీతో వెళ్తుంది
By: Tupaki Desk | 29 July 2023 4:30 PM GMTఏపీలో ఎన్నికల ముందు కచ్చితంగా బీజేపీ పొత్తులకు టీడీపీతో వెళ్తుంది అని అంతా అనుకుంటున్నదే. ఈ క్రమంలో బీజేపీ ఇదే నెలలో ఒక స్టెప్ ముందుకు వేసింది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి పురంధేశ్వరిని ప్రకటించింది. ఆ విధంగా భవిష్యత్తు జాగ్రత్తలను తీసుకుంది అని అంటున్నారు.
ఇపుడు మరో అడుగు ముందుకేసి జాతీయ కార్యదర్శి గా రాయలసీమకు చెందిన సత్యకుమార్ ని నియమించింది. ఆయన కూడా బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. పైగా ఆయన పక్కా వైసీపీ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. దీంతో ఏపీలో బీజేపీ వ్యూహాలు ఏమిటి అన్నది ఈ నియామకాలతో తేలిపోయింది అని అంటున్నారు.
ఇక ఎపీలో బీజేపీ ఇప్పటిదాకా అంటే 2014 నుంచి 2023 దాకా చాలానే ప్రయోగాలు చేసింది. విభజన తరువాత ఏపీకి కంభంపాటి హరిబాబు ప్రెసిడెంట్ గా అయ్యారు. ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన ఉండగానే జరిగిన 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది. అలాగే ఎమ్మెల్సీ సీట్లను కూడా మూడు దాకా దక్కించుకుంది.
ఆ తరువాత 2019 ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను ప్రెసిడెంట్ గా చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. 2020లో సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ ని చేస్తే ఆ మధ్యలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ లోకల్ బాడీ ఎన్నికలు చివరికి ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమిని మూటకట్టుకుంది. మరో వైపు ఏపీలో టీడీపీతో కలసి పొత్తులకు అడుగులు వేస్తున్న జనసేనతో బీజేపీ పొత్తు ఉంది.
అయితే ఏపీలో బీజేపీ స్థానిక నాయకత్వం గతంలో కొంత విముఖంగా ఉంటూ వచ్చింది. ఇపుడు ఆ లోటు తీర్చుకునేందుకా అన్నట్లుగా పురంధేశ్వరిని మార్చారు. ఆమె పదవీ బాధ్యతలు తీసుకున్నా వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఆమెకు తోడు అన్నట్లుగా సత్యకుమార్ కి పదవి ఇచ్చారు. ఆయన సైతం కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు అని అంటారు.
దీంతో బీజేపీ తనకు ఏపీలో అచ్చి వచ్చిన సామాజికవర్గం ముందు ఉంచి రాజకీయ వ్యూహాలను రచిస్తోంది అని అంటున్నారు. ఇక ఏపీ బీజేపీ ఇంచార్జిగా ఈ రోజు వరకూ ఉన్న సునీల్ దేవేధర్ ని కూడా తప్పించేశారు. ఆయన ఏపీలో టీడీపీతో పొత్తులు అసలు లేవు అంటూ పదే పదే మీడియాతో మాట్లాడుతూ భారీ ప్రకటనలే చేస్తూ వచ్చారు.
దాంతోనే ఆయనను తప్పించి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి టీడీపీ తో రేపటి ఎన్నికల్లో పొత్తుకు మార్గం సుగమం చేసుకోవడానికే ఈ నియామకాలు అని కూడా అంటున్నారు. అంతే కాదు ఏపీలో బీజేపీ టీడీపీ ఒకే సామాజికవర్గం ఓట్లను గురి పెట్టారని, రేపటి ఎన్నికలలో పొత్తుల వల్ల అవి నూరు శాతం ఫలించే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు.