ఫస్ట్ టైం బీజేపీ నుంచి బాబుకి ఒక రియాక్షన్!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన అనంతరం చాలా మంది నేతలు ఈ విషయంపై స్పందించారు
By: Tupaki Desk | 14 Sep 2023 10:41 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన అనంతరం చాలా మంది నేతలు ఈ విషయంపై స్పందించారు. వీరిలో కొంతమంది అరెస్టును ఖండిస్తే... మరికొంతమంది అరెస్టు చేసిన విధానాన్ని ఖండించారు. ఈ సమయంలో తాజాగా బీజేపీ నుంచి ఊహించని రీతిలో ఒక రియాక్షన్ వచ్చింది. పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటనల నేపథ్యంలో ఈ రియాక్షన్ పొలిటికల్ గా ప్రాధాన్యత సంతరించుకుంది.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్టు అనంతరం పురందేశ్వరి స్పందించారు. అరెస్టు ను బీజేపీ ఖండిస్తుందని ట్వీట్ చేశారు. అనంతరం బీజేపీ నేతలు సీఎం రమేష్ మొదలైన వారు చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని స్పందిస్తే... జీ-20 సదస్సు సమయంలోనే అరెస్ట్ చేయాలా అంటూ మరికొందరు స్పందించారు.
అయితే... ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల రియాక్షన్ ఇలానే ఉంటుందని, వీరంతా బీజేపీలో ఉంటూ టీడీపీ చంద్రబాబు మేలుకోరే కోవలోకి వస్తారని కామెంట్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పై స్పందించారు. ఇందులో భాగంగా... మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేసిన విధానం సరిగా లేదని అన్నారు. ఏవైనా ఆరోపణలు ఉంటే తొలుత నొటీసులు ఇవ్వాలని, ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేసే సమయంలో నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు.
కాగా... రెండు రోజుల క్రితం ఇదే విషయంపై ఒకసారి స్పందించారు కిషన్ రెడ్డి. ఆ సమయంలో... చంద్రబాబు అరెస్టుకు సంబంధించి డాక్యుమెంట్స్ గురించి అయితే తనకు తెలియదని, కానీ.. వస్తున్న వార్తల ప్రకారం, తమ పార్టీ రాష్ట్ర శాఖ అద్యక్షురాలు పురందేశ్వరి... నోటీసులు లేకుండా, ఎఫ్.ఐ.ఆర్. లో పేరు లేకుండా అరెస్టు చేసినట్లు తెలిపారని స్పందించారు.
టీడీపీ - జనసేన పొత్తు కన్ ఫాం అని పవన్ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో... చంద్రబాబుకు కాస్త అనుకూలంగా అన్నట్లుగా బీజేపీ కీలక నేత కిషన్ రెడ్డి రియాక్షన్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.