Begin typing your search above and press return to search.

బీజేపీ అధ్యక్షురాలు చెప్పలేదు.. కానీ ఎంపీ మాత్రం ఖండించారు!

చంద్రబాబు అరెస్టుపై స్పందించే విషయంలో ఇతర పార్టీల తీరు చర్చనీయాంశంగా మారుతోంది.

By:  Tupaki Desk   |   14 Sep 2023 9:31 AM GMT
బీజేపీ అధ్యక్షురాలు చెప్పలేదు.. కానీ ఎంపీ మాత్రం ఖండించారు!
X

చంద్రబాబు అరెస్టుపై స్పందించే విషయంలో ఇతర పార్టీల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. జాతీయ పార్టీల తీరు అయితే మరీ విడ్డూరంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా బీజేపీ తీరు అయితే అంతుపట్టడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బాబు అరెస్టుపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మొదట్లో గొంతు పెంచారు.. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారనే చెప్పాలి. కానీ ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం బాబు అరెస్టుపై భిన్న వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.

ఇప్పటికే బీజేపీ అండతోనే చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించిందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో నేరుగా బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కాకుండా ఆ పార్టీ ఎంపీ స్పందించడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. బాబు అరెస్టు కాగానే స్పందించిన పురందేశ్వరి.. ఆ అరెస్టును ఖండించారు. కానీ మరిది కాబట్టి బాబు విషయంలో ఆమె అలా రియాక్టయ్యారనే వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో ఈ విషయాన్ని కుటుంబానికి పరిమితం చేయకుండా ఉండేందుకే ఇప్పుడు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిసింది. అందుకే ఆ తర్వాత పురందేశ్వరి సైలెంట్ అయ్యారని టాక్.

బాబు విషయంపై పురందేశ్వరి మాట్లాడితే అది కుటుంబ విషయంగా మిగిలిపోతుందని బీజేపీ అధిష్ఠానం భావించినట్లు సమాచారం. అందుకే తాజాగా ఎంపీ సీఎం రమేష్ ఈ విషయంపై బీజేపీ వైఖరిని బయటపెట్టారని తెలిసింది. చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండిస్తోందని ఎంపీ అన్నారు. అంతే కాకుండా బాబు అరెస్టయిన రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశానని ఆయన చెప్పారు. దీనిపై తనకు సమాచారం ఉందని నడ్డా చెప్పినట్లు ఎంపీ రమేశ్ వెల్లడించారు. రాజకీయ కారణాలతో బాబును అరెస్టు చేశారని, దీన్ని ఖండించాలని నడ్డా చెప్పినట్లు రమేశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా వైసీపీపై పోరాటానికి బీజేపీ సిద్ధంగా ఉందని కూడా చెప్పడం గమనార్హం.