ఏపీని ఆడిస్తున్న బీజేపీ... మూడు పార్టీలతో మ్యూజికల్ చైర్!
ఎక్కడైనా కుక్క తన తోకను ఆడిస్తుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగేది. కానీ తోక కుక్కను ఆడిస్తే అది వింతల్లో కెల్లా వింత అవుతుంది
By: Tupaki Desk | 17 Aug 2023 9:33 AM GMTఎక్కడైనా కుక్క తన తోకను ఆడిస్తుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగేది. కానీ తోక కుక్కను ఆడిస్తే అది వింతల్లో కెల్లా వింత అవుతుంది. కానీ ఏపీలో అదే జరుగుతోంది. ఏపీలో 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్క భద్రంగా ఉంది. నోటా కంటే తక్కువ ఓట్లు కమలం పార్టీకి వచ్చాయి.
అయినా సరే ఏపీ రాజకీయాలను శాసించే స్థాయిలోకి బీజేపీ రావడమే రాజకీయ విచిత్రం అనుకోవాలని అంటున్నారు. ఏపీలో మూడు ప్రధాన పార్టీలను బీజేపీ తన వెంట తిప్పుకుటోంది. ఆర్ధిక కారణాలతో మద్దతు కోసం వైసీపీ బీజేపె తో ఉంటోంది. ఇక బీజేపీతో 2019 ఎన్నికలు అయిన వెంటనే పొత్తు పెట్టుకున్న జనసేన కేంద్రం అండ తనకు ఉందని చెప్పుకుంటోంది.
ఆ విధంగా ఏపీ రాజకీయాల్లో తన దూకుడు సాగించవచ్చు అన్నది జనసేన ప్లాన్. అంతే కాదు ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని అంతా గుత్తమొత్తంగా ఒకే చోటకు చేరిస్తేనే వైసీపీ ఓడుతుంది అన్నది జనసేన వ్యూహంగా ఉంది.
దాంతో జనసేన అటు బీజేపీతో స్నేహం చేస్తూనే టీడీపీతో సన్నిహితంగా ఉంటోంది. ఈ రెండు పార్టీలకు మధ్యన ఉండాలని మీడియేషన్ చేయాలని జనసేన చూస్తోంది. 2024 లో మూడు పార్టీలు కలసి రావాలన్నది జనసేన ప్లాన్. అందుకే బీజేపీని ఆ పార్టీని ఏమీ అనకుండా జనసేన ఉంటోంది అని అంటున్నారు.
ఇక తెలుగుదేశం విషయం సరే సరి. ఆ పార్టీకి బీజేపీ అండ కావాలి. బీజేపీని కలుపుకుని పోతేనే ఏపీలో వైసీపీని ఓడించగలమని భావిస్తోంది. దాంతో టీడీపీ బీజేపీ మద్దతు కోసం తన ప్రయత్నాలు తాపత్రయాలు అలా కొనసాగిస్తోంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు బీజేపీ ఏ బిల్లు కేంద్రంలో పెట్టినా అటు అధికార వైసెపీ ఇటు బీజేపీ రెండూ మద్దతుగా నిలుస్తునాయి. కాశ్మీర్ స్వయంప్రతిపత్తి అయిన 370 ఆర్టికల్ ని రద్దు చేసినా కూడా మద్దతు ఇచ్చిన ఈ పార్టీలు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చారు. అలాగే ఎన్నో బీజేపీ తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలకు ఏపీ నుంచి అవుట్ రేట్ గా మద్దతు దక్కింది అని అంటున్నారు.
ఇక ఏపీలో ఏ మాత్రం బలం లేకపోయినా బీజేపీ మాత్రం ఈ మూడు పార్టీలను తన గుప్పిట ఉంచుకుని ఆడిస్తోంది అన్న భావన అయితే అంతటా ఉంది. వైసీపీ విషయం చూసుకుంటే బీజేపీ ఏపీలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా జట్టు కట్టకుండా న్యూట్రల్ గా ఉండాలని 2024 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా ఉంటేనే తమకు రాజకీయంగా లాభమని భావిస్తోంది.
ఇలా అన్ని పార్టీలు ఆప్షన్లు అన్నీ కూడా బీజేపీకి ఇచ్చేసి కూర్చున్నాయి. దాంతో ఏపీలో బీజేపీ ఆడిందే రాజకీయం అన్నట్లుగా సీన్ ఉంది అని అంటున్నారు బీజేపీ ఏ విషయం చెప్పకుండా ఎవరి మద్దతు అన్నది తేల్చకుండా తాను ఒక వైపు ఉండి ఏపీ రాజకీయాన్ని తన చేతుల్లో ఉంచుకుని ముందుకు సాగుతోంది అని అంటున్నారు.
ఈ విధంగా బీజేపీ నేర్పుతో సాగిస్తున్న రాజకీయం మూలంగా ప్రధాన పార్టీల కంటే బీజేపీయే అతి పెద్ద పొలిటికల్ ఫిగర్ గా కనిపిస్తోంది. ఏది ఏమైనా బీజేపీ పాత్ర ఏపీలో ఇపుడు అత్యంత ప్రధానం అయిందా అలా చేశారా అన్నది మాత్రం చర్చించాల్సిందే. బీజేపీ వరకూ చూస్తే ఈ రోజుకీ పెద్దగా బలం లేదు. 2024లో అద్భుతాలు ఏవీ జరిగిపోవు. కానీ ప్రధాన పార్టీలు అన్నీ బీజేపీతో ఉండడమే ఆ పార్టీకు అసలైన బలంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది.