Begin typing your search above and press return to search.

బీజేపీ ప్లస్ పవన్... టీడీపీని చిత్తు చేసే మాస్టర్ ప్లాన్...?

బీజేపీతో పాటు పవన్ కూడా టీడీపీతో పొత్తుకు దూరంగా ఉంటే మాత్రం టీడీపీకి అధి భారీ నష్టం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2023 9:47 AM GMT
బీజేపీ ప్లస్ పవన్... టీడీపీని  చిత్తు చేసే మాస్టర్ ప్లాన్...?
X

ఏపీలో తెలుగుదేశం పార్టీ పొత్తులు ఎత్తులను వ్యూహాలను చిత్తు చేసే ఆలోచనలకు బీజేపీ దిగుతోందా అంటే జవాబు మాత్రం అదే అని వస్తోంది. అత్యంత కీలకమైన ఎండీయే సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ని పిలిచి టీడీపీకి పక్కన పెట్టడం జరుగుతోంది. అంటే బీజేపీకి ఏపీ రాజకీయ దృశ్యం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండాలో ఒక పక్కా ప్లాన్ ఉంది అని అంటున్నారు.

ఏపీలో 2014 పొత్తులను తెలుగుదేశం గట్టిగా కోరుకుంటోంది. అందుకోసం చాలా కాలం నుంచి జనసేనను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాలను అమలు చేస్తూ వస్తోంది. అదే టైం లో బీజేపీని కూడా తమ కూటమిలోకి రమ్మని పిలుతోంది. బీజేపీకి ఏపీలో వన్ పర్సెంట్ కంటే తక్కువగా ఓటు ఉన్నా కేంద్రంలో అధికారం ఉండడమే అతి పెద్ద బలం. అందువల్ల ఎన్నికల వేళ ఎలక్షనీరింగ్ విషయంలో బీజేపీ తోడ్పాటు ఎంతో మేలు చేస్తుంది అన్నదే టీడీపీ ఎత్తుగడ.

అదే సమయంలో బీజేపీని అలా విడిగా ఉంచితే జగన్ కి ఆ పార్టీ తెర వెనక మద్దతు ఇస్తే జగన్ కి అది ఎంతో లాభంగా ఉంటుందని, మరోసారి ఆయన గెలిచేందుకు ఉపకరిస్తుంది అన్నది టీడీపీ ఆలోచన. అందుకే బీజేపీని కూడా తమతో రమ్మని కోరుతోంది. అందుకే 2020లో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనను చాలా కాలం ముందు నుంచి తమ వైపు ఉండేలా చేసుకుంది. ఆ విధంగా పొత్తులతో తమ కూటమిలోకి రావాల్సిన అనివార్యతను బీజేపీకి కల్పించింది.

అయితే బీజేపీ కూడా ఏమీ తీసిపోవడంలేదు. టీడీపీ ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. అందుకే పవన్ని తమ మిత్రుడిగానే ఎప్పటికి గుర్తిస్తూ ఆయనకే ఎన్డీయే సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించింది. దాదాపుగా ముప్పయి పార్టీలు ఎన్డీయే కీలక భేటీలో పాలు పంచుకుంటాయని భావిస్తున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క జనసేనకే పిలవడం ద్వారా పవన్ కి బీజేపీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్ధం అవుతోంది అని అంటున్నారు.

అదే టైం లో ఏపీలో అతి పెద్ద పార్టీగా ఉంటూ 2019 వరకూ ఎన్డీయేలోనే ఉన్న టీడీపీకి ఆహ్వానం లభించకపోవడం అంటే ఆలోచించాల్సింది చాలానే ఉంది అని అంటున్నారు. గతంలో బీజేపీని ఎన్డీయేని వీడినా శిరోమణి అకాలీదళ్ తో పాటు బీహార్ లో హిందుస్థాన్ అవామీ లాంటి పార్టీలను బీజేపీ పిలిచింది. మరి ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎందుకు పిలవలేదు అన్నదే చర్చగా ఉంది.

ఇక ఎన్డీయే మీటింగ్ కి జనసేనను కూడా పిలవకుండా ఉంటే ఓకే బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని కొంత నష్టం భరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉండేది. కానీ పవన్ని తమతో ఉంచుకుంటూ టీడీపీకి రెడ్ సిగ్నల్ చూపించడం వల్లనే ఇపుడు పసుపు పార్టీలో కొత్త సందేహాలు పుట్టుకుని వస్తున్నాయని అంటున్నారు.

బీజేపీతో పాటు పవన్ కూడా టీడీపీతో పొత్తుకు దూరంగా ఉంటే మాత్రం టీడీపీకి అధి భారీ నష్టం అని అంటున్నారు. అపుడు ఏపీలో టీడీపీకి వామపక్షాలు, కాంగ్రెస్ వంటి వాటితోనే పొత్తు ఉంటుంది. అలా ఏపీలో త్రిముఖ పోరు సాగుతుంది. అది భారీ ఎత్తున ఓట్ల చీలికకు దారి తీసి అంతిమంగా ఏపీలో మరోమారు జగన్ అధికారంలోకి వచ్చేందుకు వీలు పడేలా చేస్తుంది అని టీడీపీ మధనపడుతోంది అని అంటున్నారు.

ఏపీలో 2024లో జరిగే ఎన్నికలు టీడీపీకి చాలా ముఖ్యం. ఈ దఫా అధికారంలోకి రావాలని ఆ పార్టీ గట్టి పట్టుదలగా ఉంది. తానే మరోమారు ఏపీ సీఎం అవుతాను అని చంద్రబాబు రెండేళ్ళ క్రితం అసెంబ్లీ వేదికగా చెప్పి బయటకు వచ్చారు. ఇక ఆయన ఈసారి గెలిస్తే తెలుగుదేశం పార్టీని మరి కొన్నాళ్ళ పాటు సాఫీగా నడిచేలా చేసుకోగలరు.

అయితే ఆ చాన్స్ బాబుకు ఇవ్వకూడదు అన్నది బీజేపీ ఆలోచన అని అంటున్నారు. ఈ ఎన్నికలతో టీడీపీకి ప్రాణం పోస్తే చంద్రబాబు టీడీపీ స్ట్రాంగ్ అయితే మళ్లీ బీజేపీకి ఏపీ పట్టు చిక్కదు. అందుకే 2029 టార్గెట్ గా పెట్టుకుని ఏపీ రాజకీయాలను తనదైన శైలిలో ముందుకు నడిపిస్తోంది అని అంటున్నారు. జగన్ తో కేంద్ర బీజేపీ పెద్దలు ఒక వైపు సాన్నిహిత్యం నెరపుతూ మరో వైపు పవన్ని తమ వైపునకు తిప్పుకుంటున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీని దూరం పెడుతున్నారు. బీజేపీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం చంద్రబాబు టీడీపీ 2024 ఎన్నికల్లో బహుముఖ పోటీని ఎదుర్కోక తప్పదు. అలా భారీ రాజకీయ నష్టం తో పాటు అధికారానికి టీడీపీని దూరం చేయాలన్న ప్లాన్ ఏమైనా కమలం పార్టీ పెద్దల వద్ద ఉందా అన్నదే ఇపుడు పసుపు శిబిరంలో పెద్ద చర్చగా ఉంది అని అంటున్నారు.