బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్!
ఈ కేసును వాడుకుని తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 2 Jun 2024 11:30 PM GMTతెలంగాణలో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దొరికిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును ఉపయోగించుకుని అటు అధికార కాంగ్రెస్‌ను, ఇటు బీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే చెప్పాలి. లక్ష్మణ్, బండి సంజయ్ తదితర బీజేపీ నేతలు ఇప్పుడీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణ కోరడమే అందుకు రుజువని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కేసును వాడుకుని తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రశ్నించకుండా బీజేపీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసునే ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా రాధాకిషన్ రావు స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతూ బీజేపీ తనదైన రాజకీయం చేసేందుకు ఎత్తుగడ వేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. బీజేపీ ఈ కేసును వాడుకుని కేసీఆర్‌ను లొంగదీసుకునే ప్రయత్నాలూ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సీబీఐని రంగంలోకి దించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్న వాదన కూడా ఉంది. దీని వెనుక కేసీఆర్‌ను సీబీఐ ఉచ్చులో బంధించి, బీఆర్ఎస్ మద్దతుతో రేవంత్ సర్కారును కూల్చేందుకు బీజేపీ వ్యూహం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.