Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ ఎంపీ ఆశలు ఎన్ని ?

ఎందుకంటే కేంద్రంలో 273 మ్యాజిక్ ఫిగర్ కోసమే బీజేపీ ఆరాటం అంతా ఉంది.

By:  Tupaki Desk   |   24 May 2024 5:07 PM GMT
ఏపీలో బీజేపీ ఎంపీ ఆశలు ఎన్ని ?
X

ఏపీలో బీజేపీ టీడీపీ కూటమితో పొత్తు పెట్టుకుని ఆరు ఎంపీ సీట్లకు పోటీ చేసింది. రీజియన్ల వారీగా కూడా సరిగ్గానే లెక్క చూసుకుని బరిలోకి దిగింది. ఉత్తరాంధ్రా జిల్లాలలో అనకాపల్లి, అరకు గోదావరి జిల్లాలలో రాజమండ్రి, నర్సాపురం, అలాగే రాయలసీమలో తిరుపతి, రాజంపేట సీట్లలో పోటీ చేసింది.

అయితే బీజేపీ వరకూ అసెంబ్లీ సీట్ల కంటే ఎంపీ సీట్లే ముఖ్యం. ఎందుకంటే కేంద్రంలో 273 మ్యాజిక్ ఫిగర్ కోసమే బీజేపీ ఆరాటం అంతా ఉంది. ఆ మ్యాజికి నంబర్ కి కలసి వచ్చే ప్రతీ సీటూ విలువైనదే. తెలంగాణాలో కనీసంగా ఎనిమిది ఎంపీ సీట్లను తమ ఖాతాలో వేసుకుంటామని భావిస్తున్న బీజేపీ ఏపీలో నాలుగు ఎంపీలు తమవే అని నిబ్బరం ప్రదర్శిస్తూ వచ్చింది.

అయితే పోలింగ్ అనంతరం సరళిని చూస్తే తెలంగాణాలో ఆరు ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుచుకోవచ్చు అని ఒక విశ్లేషణ బయటకు వచ్చింది. కానీ ఏపీలో చూస్తే అలాంటి ఆశలు ఏ మేరకు ఉన్నాయని చూస్తే బీజేపీకి ఆరు ఎంపీ సీట్లలో మూడు మాత్రమే గెలుపు ఊగిసలాటల మధ్య ఉన్నాయని అంటున్నారు.

ముందుగా ఉత్తరాంధ్రాలో తీసుకుంటే అరకు సీటు కచ్చితంగా వైసీపీ ఖాతాలో వెళ్తుంది అని అంటున్నారు అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కూటమి తరఫున గుడ్ ఎఫెర్టులు పెట్టారు కానీ ఈ ఫలితం కూడా ఊగిసలాటలో ఉందని అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలలో రెండు సీట్లూ గతంలో బీజేపీ గెలిచి ఉన్న చరిత్ర ఉంది. పైగా రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీలో ఉన్నారు. దాంతో ఇక్కడ ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే నరసాపురం సీటు కూడా కమలం ఖాతాలో పడే చాన్స్ ఉండవచ్చు అని అంటున్నారు. రాయలసీమలో చూస్తే మాత్రం తిరుపతి రాజంపేట రెండు సీట్లూ వైసీపీ ఖాతాలోనే పడతాయని పోలింగ్ అనంతరం వచ్చిన విశ్లేషణలు అధ్యయనాలు తెలియచేస్తున్న సత్యాలు.

అయితే రాజంపేట సీటులో హోరా హోరీ పోరు సాగింది అని ఈసారి గెలుపు కోసం వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి బాగా శ్రమించాల్సి వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీకి రెండు ఎంపీ సీట్ల మీదనే హోప్స్ ఉన్నాయని అంటున్నారు. కూటమి ఓట్లు పూర్తిగా బదిలీ అయితేనే ఇక్కడ భారీ మెజారిటీలకు ఆస్కారం ఉంటుందని కూడా అంటున్నారు. దాంతో ఏపీలో గతం కంటే బెటర్ పొజిషన్ అని బీజేపీ అనుకోవాల్సిందే అంటున్నారు. ఎందుకంటే గతంలో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయి కాబట్టి.

ఇక పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఎన్ని గెలుచుకుంటుంది అంటే ఆ నంబర్ మీద కూడా ఏమంత ఆశాజనకంగా లేదు అనే వస్తోంది. గెలిస్తే రెండు లేక మూడు అని అంటున్నారు. అది కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారి వ్యక్తిగత ఇమేజ్ తోనే గెలుపు తీరాలకు చేరుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ రాజకీయ ప్రదర్శన బెటర్ అనే చెప్పాలని అంటున్నారు. హోరా హోరీ పోరులో కూడా ఇన్ని సీట్లు తెచ్చుకోవడం జరిగితే ఏపీలో బీజేపీ తన హవా చాటినట్లే అంటున్నారు.