ఉచితాలు తాయిలాలు లేకుండా బీజేపీ సంచలనం !
దేశంలో గత కొన్నేళ్ల బట్టి ఉచిత పధకాలు తాయిలాలతో రాజకీయ పార్టీలు ఊదరగొడుతున్నాయి.
By: Tupaki Desk | 14 April 2024 5:31 PM GMTదేశంలో గత కొన్నేళ్ల బట్టి ఉచిత పధకాలు తాయిలాలతో రాజకీయ పార్టీలు ఊదరగొడుతున్నాయి. ఒక విధంగా జనాల నుంచి ఓట్లను గుంజుకోవడం కోసం ఇంతకంటే దగ్గర మార్గం లేదు అని భావిస్తున్నాయి. ఓటర్లను బిచ్చగాళ్ళను నిస్సహాయులను చేస్తూ తన పబ్బం గడుపు కుంటున్నాయి. ఓట్ల పంట పండించుకొని అధికారంలోకి వస్తున్నాయి.
అయితే దేశంలో ఒక అతి పెద్ద జాతీయ పార్టీగా బీజేపీ ఉచితాలకు నో చెబుతూ అత్యంత బోల్డ్ డెసిషన్ తీసుకుంది. మరో వైపు ఇండియా కూటమి అయితే ఆల్ ఫ్రీ అంటూ బ్రహ్మాండమైన ఉచిత హామీలతో కొద్ది రోజుల క్రితం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన తరువాత కూడా బీజేపీ ఏ మాత్రం టెంప్ట్ కాకుండా తనదైన విధానాన్ని అమలు చేసింది.
ఉచితాల మీద అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడారు. వాటిని అమలు చేస్తున్న రాష్ట్రాల తీరు మీద ఆయన మండిపడ్డారు. ఆర్ధికంగా దిగజారుడు మెట్లుగా ఉచిత హామీలు ఉంటాయన్నది బీజేపీ భావనగా ఉంది. అందుకే బీజేపీ ఎక్కడా ఉచితం అన్నది లేకుండా అభివృద్ధి అజెండాను తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆవిష్కరించింది.
ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద ఆవిష్కరించబడిన బీజేపీ సంకల్పపత్రంలో చూస్తే దేశాన్ని పటిష్టం చేసేందుకు లక్ష్యాలను పెట్టుకుంది తప్ప ఉచితాలతో తాత్కాలిక పధకాలతో జనాలకు దగ్గర కావాలని చూడడంలేదు. అలా చూస్తే కనుక బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాల అమలును పూర్తిగా పక్కన పెట్టేసింది. అదే సమయంలో అభివృద్ధి మంత్రాన్ని అడుగడుగునా ప్రతిధ్వనించింది.
నిజానికి ఉచిత పథకాలు లేకుండా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయడం సాహసమే. కానీ బీజేపీ ఆ పని చేసి చూపించింది. భారతదేశంలో అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. దాన్నే అందులో పెట్టింది. ఇక వరసగా మూడవసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ ఉచిత పధకాలను వెల్లువలా ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు.
కానీ ఆ ఆశలు పూర్తిగా రివర్స్ చేస్తూ బీజేపీ ఎన్నికల మ్యానిఫేస్టో రిలీజ్ అయింది. ఈ మ్యానిఏస్టోలో కరోనా నుండి అమలులో ఉన్న ఉచిత రేషన్ తప్ప ఏ ఉచిత పధకాల ప్రస్తావన అన్నది లేకుండా పోయింది. అదే విధంగా ముద్రా రుణాలు స్వయం ఉపాధి పథకాలు కూడా సబ్సిడీలకే పరిమితం చేయబడ్డాయని గుర్తుంచుకోవాలి. ఇక వ్యవసాయ రుణాల మాఫీ గురించి గానీ, అంగన్‌వాడీల జీతాల పెంపు గురించి గానీ బీజేపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల ఎవర్ గ్రీన్ డిమాండ్ గా ఉనన్ సీపీఎస్ రద్దు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత డిమాండ్ కూడా పక్కన పెట్టేశారు.
అయితే బీజేపీ చెప్పినట్లుగా చూస్తే కనుక ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు కొనసాగుతాయి సూర్య ఘర్ యోజన, వికలాంగుల కోసం ప్రత్యేక గృహాలు వంటివి సబ్సిడీ పైనే అమలు చేస్తారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలకు భద్రత కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
ఈ విధనగా ఉన్న బీజేపీ మేనిఫెస్టో దేశంలోని అన్ని ఇతర రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం కావాలని అంటున్నరు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక బలమైన జాతీయ పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక దేశం దాని అభివృద్ధి చుట్టూ తిరిగింది తప్ప ఓటర్లను ఆకట్టుకోవడానికి చిల్లర హామీలతో సాగిలపడేలా లేదని అంటున్నారు. ఇది మంచి పరిణామంగా చెబుతున్నారు. ఇలాగే మిగిలిన పార్టీలు కూడా ఉచితాలకు దూరంగా ఉంటూ అభివృద్ధికి దగ్గరగా ఉంటే కనుక రాష్ట్రాలు కూడా బాగుపడతాయని రాజకీయ విశ్లేషకులు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.