మోడీ ముందు బాబు అలా చెప్పాలంట...జగన్ నయా సవాల్ !
శనివారం జగన్ ఎన్నికల సభలలో ప్రతీ చోటా ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల గురించే ఎక్కువగా మాట్లాడారు.
By: Tupaki Desk | 4 May 2024 6:08 PM GMTతెలుగుదేశం కూటమి ఏ విషయాన్ని అయితే పక్కన పెట్టి ఉంచాలనుకుంటోందో దానిని ఒడుపుగా వైసీపీ బయటకు తీస్తోంది. నిజానికి ఇది లేట్ అయిన వ్యవహారం కానీ లేటెస్ట్ గా జగన్ దాన్ని తీశారు. ప్రచారానికి కరెక్ట్ గా ఏడు రోజులు మాత్రమే టైం ఉంది. పోలింగ్ కి తొమ్మిది రోజులు టైం ఉంది ఉంది. దాంతో టీడీపీ కూటమిని ఆయన గట్టిగా కార్నర్ చేశారు.
శనివారం జగన్ ఎన్నికల సభలలో ప్రతీ చోటా ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల గురించే ఎక్కువగా మాట్లాడారు. బీజేపీ ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటోంది. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తోంది వారిలో పేదలకు మాత్రమే. హిందువులలో మాదిరిగానే వారిలోనూ ఓసీలు బీసీలు ఉన్నారని అందుకే వాటిని అమలు చేయాల్సిందే అని జగన్ అంటున్నారు.
తాము వాటిని ఎక్కడా రద్దు చేయబోమని దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతి తో పాటు ఇతర అంశాల మీద పోరాటం చేస్తామని చెప్పారు. తాను ఇంత కచ్చితంగా చెబుతున్నాను అని అదే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పగలరా అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు మోడీతో కలసి పాల్గొనే సభలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్పగలరా అలాగని మోడీ చేత హామీ ఇప్పించగలరా అని జగన్ సవాల్ చేశారు. బీజేపీ ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతోంది. దాంతో ఆ పార్టీ ఎంత పట్టుదలగా ఉందో అందరికీ తెలుసు అన్నారు. అటువంటి పార్టీతో జత కట్టి చంద్రబాబు ఇపుడు ముస్లిం ల పట్ల కపట ప్రేమను నటిస్తూ మభ్యపెట్టే హామీలు ఇస్తున్నారు అని అన్నారు.
తమ పార్టీ మొదటి నుంచి ముస్లింలకు అండగా ఉందని ఆయన చెప్పుకున్నారు. ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఒకే ఒక పార్టీ వైసీపీ అని అన్నారు. తాజా ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ ఏడు సీట్లు ముస్లింలకు ఇచ్చి వారికి తగిన న్యాయం చేశామని అన్నారు. అలాగే అయిదేళ్ళ తమ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాను ముస్లిం మైనారిటీలకు ఇచ్చామని వారిలో ఒకరిని శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ చేశామని, నలుగురుకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని ఆయన చెప్పుకున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ముస్లిం రిజర్వేషన్ల మీద చంద్రబాబుకు జగన్ సవాల్ మాత్రం రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది. మోడీ ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. దాంతో మోడీ ఎదుటనే ముస్లిం రిజర్వేషన్ల మీద జగన్ చంద్రబాబుని డిమాండ్ చేయమంటున్నారు. అది సాధ్యం కాని విషయమని తెలుసు కనుకనే ఈ సవాల్ చేస్తున్నారు అని అంటున్నారు. దీని మీద చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.