Begin typing your search above and press return to search.

సీనియర్లకు చెక్ పెట్టిన బీజేపీ!

కీలకమైన నేతలం కదా తాము చెప్పిన వాళ్ళకి టికెట్లు దక్కకపోతాయా అని ఇద్దరు సూపర్ సీనియర్లు అనుకున్నారు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 6:08 AM GMT
సీనియర్లకు చెక్ పెట్టిన బీజేపీ!
X

కీలకమైన నేతలం కదా తాము చెప్పిన వాళ్ళకి టికెట్లు దక్కకపోతాయా అని ఇద్దరు సూపర్ సీనియర్లు అనుకున్నారు. అయితే తాజాగా విడుదలైన నాలుగో జాబితాలో వాళ్ళిద్దరికి బీజేపీ అగ్రనేతలు పెద్ద షాకిచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్, కేంద్రమంత్రిగా పనిచేసిన సీహెచ్ విద్యాసాగర్ రావు, ఇపుడు గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ వారసులు కూడా టికెట్లకు దరఖాస్తులు చేసుకున్నారు. విద్యాసాగర్ రావు, దత్తాత్రేయ వారసులు దరఖాస్తు చేసుకున్నారంటే ఇక వాళ్ళకి పోటీ ఏముంటుంది అనుకున్నారు.

సీన్ కట్ చేస్తే బీజేపీ అగ్రనేతలు ఇద్దరి వారసులకు టికెట్లు ఇవ్వలేదు. వారసత్వాన్ని ప్రోత్సహించకూడదని టికెట్లు ఇవ్వలేదో లేకపోతే గెలుపు అవకాశాలు తక్కువన్న రిపోర్టు కారణంగా టికెట్లు ఇవ్వలేదో తెలీదు. మొత్తానికి పార్టీ సూపర్ సీనియర్లిద్దరికీ ఒకేసారి షాక్ ఇచ్చింది. వేములవాడలో కొడుకు వికాసరావుకు టికెట్ కోసం విద్యాసాగర్ రావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అలాగే ముషీరాబాద్ లో టికెట్ ఇప్పించుకోవాలని కూతురు విజయలక్ష్మి కోసం దత్తాత్రేయ శతవిధాల ప్రయత్నాలు చేశారు.

అయితే వీళ్ళ ప్రయత్నాలను పార్టీ అగ్రనేతలు పట్టించుకోలేదు. వేములవాడలో తుల ఉమకు, ముషీరాబాద్ లో పూసరాజుకు పార్టీ టికెట్లు కేటాయించింది. అయితే ఇదే సమయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు ఏపీ మిథున్ రెడ్డికి పాలమూరు టికెట్ దక్కింది. వేములవాడలో వికాసరావుకు టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ కూడా ప్రయత్నించారు. వికాసరావుకు ఇవ్వలేకపోతే తానే పోటీచేస్తానని కూడా చెప్పారు. అయినా పట్టించుకోకుండా ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలో చేరిన తుల ఉమకు టికెట్ కేటాయించింది.

విచిత్రం ఏమిటంటే హుస్నాబాద్ నియోజకవర్గం టికెట్ తన మద్దతుదారుడు సురేందర్ రెడ్డికి కేటాయించాలని ఈటల గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ టికెట్ ను బండి సంజయ్ అనుచరుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించింది. దీంతో ఇటు బండిని అటు ఈటలను నొప్పించకుండా సీట్లను కేటాయించింది. అయితే సూపర్ సీనియర్లు విద్యాసాగర్ రావు, దత్తాత్రేయలను మాత్రం పార్టీ పట్టించుకోకపోవటం గమనార్హం.